Election Commission: ఎన్నికల్లో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి కొత్త వెబ్‌సైట్
- 'మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్' పేరిట వెబ్‌సైట్ తీసుకువచ్చిన ఈసీ
- వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు
- ఎన్నికల సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడమే ఈ కొత్త వెబ్‌సైట్ లక్ష్యమన్న ఈసీ
లోక్‌సభ ఎన్నికల్లో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) కొత్త వెబ్‌సైట్‌ను తీసుకువచ్చింది. మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ప్రారంభించారు.
అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టి, ఎన్నికల సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు ఈ కొత్త వెబ్‌సైట్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఈసీ వెల్లడించింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను, వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టరు ద్వారా అప్‌డేట్ చేస్తూ ఓటర్లకు తెలియజేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది.