Manmohan Singh: ఒక శకం ముగిసింది.. మాజీ పీఎం మన్మోహన్ సింగ్‌పై ఖర్గే ప్రశంసలు

 Mallikarjun Kharge pens letter as Manmohan Singh retires from Rajya Sabha

  • బుధవారం రిటైర్ కానున్న మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్
  • 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ కెరీర్‌కు ముగింపు పలకనున్న వైనం
  • మాజీ ప్రధాని సేవలను కొనియాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే

ముప్ఫైమూడేళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ కెరీర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు ముగింపు పలకనున్నారు. బుధవారం ఆయన రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధానిపై అన్ని పార్టీలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. వివిధ స్థాయుల్లో ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నాయి. మన్మోహన్ సేవలను కొనియాడుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. భారత రాజకీయాలకు, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 

ఉపాధి హామీ పథకంతో మన్మోహన్ సింగ్ గ్రామీణులకు కష్ట సమయాల్లో ఆదాయం, తలెత్తుకు బతికే అవకాశం కల్పించారని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక పునాదుల ఫలాలు నేటి సమాజానికి అందుతున్నాయని తెలిపారు. కానీ, నేటి రాజకీయ నాయకులు ఆయన పాత్రను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా క్షమించగలిగే పెద్ద మనసు ఆయన సొంతమని ప్రశంసించారు. 

మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానం
పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 1991లో ఆయన తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగి ఓటమి చవిచూశారు. సుదీర్ఘకాలం పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 1991 అక్టోబర్ 1 నుంచి  2019 జూన్ 14 వరకూ అస్సాం నుంచి ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. 1998 - 2021 మధ్య ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నారు. 

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన అద్భుత సేవ చేశారని అన్నారు. వీల్ చైర్‌లో ఉండి కూడా ఆయన కీలక చట్టాలపై ఓటేసేందుకు రాజ్యసభకు వచ్చిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య పటిష్ఠత కోసం మన్మోహన్ సింగ్ ఎంతో చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.

  • Loading...

More Telugu News