Vistara Airlines: విస్తారాలో ముదురుతున్న సంక్షోభం.. 15 మంది సీనియర్ పైలట్ల రాజీనామా
- నిన్న వరుసగా రెండోరోజూ 50కిపైగా విమానాలు రద్దుచేసిన విస్తారా
- వేతనాల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ సీనియర్ పైలట్ల రాజీనామా
- విమానాల రద్దుతో ప్రయాణికుల అసంతృప్తి
- రోజువారీ నివేదిక ఇవ్వాలన్న డీజీసీఏ
టాటా గ్రూప్‌కు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం ముదురుతోంది. నిన్న వరుసగా రెండోరోజూ విమాన సర్వీసులను రద్దుచేసింది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న 50కిపైగా విమానాలను రద్దుచేసింది. విస్తారాలో దాదాపు 800 మంది పైలట్లు ఉన్నారు. వీరిలో ఇటీవల 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేశారు.
విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. తాము పడిన ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా ఏకరవు పెడుతున్నారు. దీంతో స్పందించిన కేంద్ర పౌర విమానయాన సంస్థ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు, విమాన సర్వీసులు జాప్యం, రద్దుకు సంబంధించిన సమాచారంతోపాటు, ఇతరత్రా వివరాలపై రోజువారీ నివేదికను సమర్పించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విస్తారాను ఆదేశించింది.
ఎయిర్ ఇండియాలో విలీనం దిశగా అడుగులు వేస్తున్న విస్తారా వేసవి నేపథ్యంలో రోజుకు 300కు పైగా విమానాలు నడుపుతున్నది. వేతనాల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ సీనియర్ పైలట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 15 మంది రాజీనామా చేయడంతో గందరగోళం నెలకొంది.