North Korea: మధ్యశ్రేణి బాలిస్టిక్​ మిసైల్​ ను విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా

DPRK successfully test fires intermediate range hypersonic ballistic missile
  • 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిన వాసోంగ్ఫో 16బీ
  • తొలిసారిగా ఘన ఇంధన మధ్యశ్రేణి మిసైల్ వాడకం
  • ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేసిన దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్
డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే) మంగళవారం విజయవంతంగా మధ్యశ్రేణి హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) బుధవారం వెల్లడించింది. ఈ ప్రయోగంలో ఉత్తర కొరియా కొత్త విధానాన్ని ఉపయోగించినట్లు తెలిపింది. తొలిసారిగా మధ్యశ్రేణి ఘన ఇంధన బాలిస్టిక్ మిసైల్ ‘వాసోంగ్ఫో 16బీ’ని ప్రయోగించినట్లు వార్తాసంస్థ వివరించింది.

101 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి..
ఇందులో తొలిసారిగా అభివృద్ధి చేసిన హైపర్ సోనిక్ గ్లైడింగ్ వార్ హెడ్ ను కూడా వాడారని పేర్కొంది. దేశ రాజధాని పాంగ్ యాంగ్ శివార్లలోని సైనిక శిక్షణ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు వార్తాసంస్థ తెలిపింది. ఈ ప్రయోగంలో భాగంగా మిసైల్ తొలి దశలో 101.1 కిలోమీటర్ల ఎత్తుకు, రెండో దశలో 72.3 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని చివరకు 1,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుంది. ఆ తర్వాత అది నిర్దేశిత కచ్చితత్వంతో కొరియా ద్వీపకల్పంలోని సముద్రజలాల్లో పడిపోయింది. ఈ ప్రయోగం పొరుగు దేశాల భద్రతపై ఎటువంటి ప్రభావం చూపలేదని న్యూస్ ఏజెన్సీ వివరించింది.

కిమ్ జాంగ్ హర్షం
క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశ సైనిక శాస్ర్త, సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని చాటేందుకు ఇదో శక్తిమంతమైన, వ్యూహాత్మకమైన ఆయుధమని పేర్కొన్నారు. శత్రు దేశాలను నియంత్రించేందుకు అత్యంత శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయడం దేశం ముందున్న అతిపెద్ద బాధ్యతని చెప్పారు. దేశ భద్రత స్థాయిని పెంచేందుకు రక్షణ సాంకేతిక రంగం మరింతగా కృషి చేయాలని సూచించారు.
North Korea
missile
ballistic
hypersonic

More Telugu News