Bhanuprakash Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం: భానుప్రకాశ్ రెడ్డి
- టీటీడీ ఈవో వైసీపీ సేవలో తరిస్తున్నారన్న భానుప్రకాశ్
- దర్శనాల ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
- ధర్మారెడ్డి సేవలు అవసరమని కేంద్రానికి జగన్ లేఖ రాశారని వెల్లడి
టీడీడీ ఈవో ధర్మారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. స్వామి వారికి సేవ చేయాల్సిన ధర్మారెడ్డి... అధికార పార్టీ వైసీపీ సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై పూర్తి సాక్ష్యాధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. తిరుమల దర్శనాల ద్వారా ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సుపథం, బ్రేక్ దర్శనాలను కల్పిస్తూ ఓట్లను లబ్ధిగా పొందుతున్నారని అన్నారు.
ఈ ఎన్నికల్లో పార్టీకి అంగబలం, అర్థబలం సమకూర్చడానికే ఆయనను ఈవోగా సీఎం జగన్ కొనసాగిస్తున్నారని భానుప్రకాశ్ ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ లను కాదని ధర్మారెడ్డినే కొనసాగిస్తున్నారని చెప్పారు. ధర్మారెడ్డి సేవలు ఇంకా అవసరమని కేంద్రానికి మార్చి 12న జగన్ లేఖ రాశారని తెలిపారు. టీటీడీలో ఏ పని జరగాలన్నా ఈయనకు 15 శాతం కమిషన్ ఇవ్వాలని విమర్శించారు. అందుకే ఈయనను కొనసాగించకూడదని ఎన్నికల సంఘానికి లేఖ రాశామని చెప్పారు.