Renuka Jagtiani: ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ మహిళకు చోటు.. అసలు ఎవరీ రేణుకా జగ్తియాని?
- ‘ల్యాండ్‌మార్క్ గ్రూపు’ చైర్‌ఉమెన్‌గా ఉన్న సంపన్నురాలు
- ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు
- భర్త మిక్కీ జగ్తియాని స్థాపించిన కంపెనీని విజయవంతంగా నడుపుతున్న రేణుకా జగ్తియాని
భారత్‌లో సంపన్నుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ సంపన్నుల జాబితాలో కొత్తగా 25 మంది భారతీయ బిలియనీర్లు అడుగుపెట్టారు. వీరిలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన నికర సంపదతో రేణుకా జగ్తియానీ అనే మహిళ కూడా ఉన్నారు. దుబాయ్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కన్య్సూమర్ ఉత్పత్తుల కంపెనీ ‘ల్యాండ్‌మార్క్ గ్రూప్’కు ఆమె చైర్‌ఉమెన్‌గా, సీఈవోగా ఉన్నారు.
ఈ కంపెనీని రేణుకా జగ్తియాని భర్త మిక్కీ జగ్తియాని స్థాపించారు. అయితే గతేడాది మే నెలలో ఆయన చనిపోయిన నాటి నుంచి రేణుకా జగ్తియాని తన మార్గదర్శకత్వంలో కంపెనీని నడిపిస్తున్నారు. 50,000 మందికి పైగా ఈ కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మధ్యప్రాచ్య దేశాలు, భారత ఉపఖండం, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో విస్తరణ కోసం రేణుకా జగ్తియాని కృషి చేస్తున్నారు.
కాగా ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ విభాగంలో ఆమె బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 1993లో ల్యాండ్‌మార్క్ కంపెనీలో ఆమె అడుగుపెట్టారు. కుటుంబం విషయానికి వస్తే ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి పేర్లు ఆర్తి, నీషా, రాహుల్. వీరు ముగ్గురూ గ్రూప్ డైరెక్టర్‌లుగా కొనసాగుతున్నారు.
ఎన్నో అవార్డులు అందుకున్న రేణుకా..
నిబద్ధత, అంకితభావంతో పనిచేసే రేణుకా జగ్తియానిని పలు అవార్డులు వరించాయి. జనవరి 2007లో ఏషియన్ బిజినెస్ మిడిల్ ఈస్ట్ అవార్డ్స్‌లో అత్యుత్తమ ‘ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను అందుకున్నారు. జనవరి 2012లో గల్ఫ్ బిజినెస్ ఇండస్ట్రీ అవార్డ్స్‌లో ‘బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’, 2014లో ‘వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరమ్ అవార్డ్స్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తగా గౌరవం పొందారు. ఇక జనవరి 2015లో ఇండియన్ సీఈవో అవార్డ్స్‌లో ‘స్ట్రాటజిక్ లీడర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచారు. జనవరి 2017లో వరల్డ్ రిటైల్ కాంగ్రెస్‌లో 'హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆమె పేరుని చేర్చారు. కాగా మధ్యప్రాచ్య దేశాలు, భారత ఉపఖండం, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో ‘ల్యాండ్‌మార్క్’ కంపెనీ విస్తరణ కోసం ఆమె కృషి చేస్తున్నారు.