Wild Elephant Attack: అడవి ఏనుగు దాడిలో తెలంగాణ రైతు మృతి
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఘటన
- తన మంద నుంచి తప్పిపోయి తెలంగాణలోకి వచ్చిన మగ ఏనుగు
- బూరెపల్లి గ్రామంలో పొలంలోని రైతుపై దాడి
- ఘటనా స్థలంలోనే రైతు మృతి
- బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన అటవీ శాఖ
అడవి ఏనుగు దాడిలో ఓ రైతు మృతి చెందిన ఘటన బుధవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడు అల్లూరి శంకర్ (45) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కౌటల మండలం బూరెపల్లి గ్రామంలోని తన పొలానికి వెళ్లిన అతడిపై ఏనుగు దాడి చేసి పొట్టనపెట్టుకుంది.
అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఏనుగుల మంద ఒకటి ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర గడ్చిరోలికి వచ్చింది. అయితే, మంద నుంచి తప్పిపోయిన ఓ మగ ఏనుగు ప్రాణహిత నది దాటి తెలంగాణలోకి వచ్చింది. ఈ క్రమంలో రైతుపై దాడి చేయడంతో మృతి చెందాడు.
మరోవైపు, బాధిత కుటుంబానికి అటవీ శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. దారి తప్పిన మగ ఏనుగును మళ్లీ ఏనుగుల గుంపుతో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.