Ghana: 12 ఏళ్ల బాలికను పెళ్లాడిన 63 ఏళ్ల పూజారి.. ఘనా వ్యాప్తంగా నిరసనలు.. సమర్థిస్తున్న కమ్యూనిటీ ప్రజలు
- ఘనా రాజధాని అక్రాలోని నంగ్వా ప్రాంతంలో ఘటన
- సంప్రదాయబద్ధంగా అట్టహాసంగా పెళ్లి
- వివాహం చట్టవ్యతిరేకమంటూ విమర్శలు
- ఆరేళ్ల వయసు నుంచే బాలికను సిద్ధం చేసిన కమ్యూనిటీ
- విమర్శలు చేసేవారికి తమ ఆచారాలు, సంప్రదాయాలు తెలియవంటున్న కమ్యూనిటీ ప్రజలు
- బాలికను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు
63 సంవత్సరాల మతబోధకుడు ఒకరు 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఘనా రాజధాని అక్రాలోని నంగ్వా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. సంప్రదాయ ప్రధాన పూజరి సురు అట్టహాసంగా జరిగిన వేడుకలో బాలికను పెళ్లాడాడు. ఘనాలో అమ్మాయిల చట్టబద్ధ వివాహ వయసు 18 ఏళ్లు కాగా, సురు 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవడం దుమారం రేగింది.
ఘనంగా జరిగిన ఈ వివాహానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో తెల్లని దుస్తులు, అందుకు మ్యా్ అయ్యే హెడ్‌పీస్ ధరించిన బాలికతో స్థానిక మహిళలు భర్తను ఆటపట్టించే దుస్తులు ధరించమని, భార్య విధులకు సిద్ధంగా ఉండాలని, భర్తకు ఆకర్షణ కలిగించేలా వ్యవహరించాలని చెప్పినట్టు బీబీసీ తెలిపింది. అంతేకాదు, పరిమళ ద్రవ్యాలను కూడా ఉపయోగించాలని వారు ఆ బాలికతో చెప్పారు.
వివాహం ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాక దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. వివాహాన్ని రద్దుచేసి పూజారిని అరెస్టు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, స్థానిక కమ్యూనిటీ ప్రజలు మాత్రం ఈ వివాహాన్ని సమర్థించారు. విమర్శిస్తున్న వారికి తమ ఆచారాలు, సంప్రదాయాలు తెలియవని, అర్థం చేసుకోలేరని స్థానిక సంఘం నాయకుడు పేర్కొన్నారు. పూజారి భార్యగా ఆ బాలిక పూర్తిగా సంప్రదాయం, ఆచారం ప్రకారం నడుచుకుంటుందని వివరించారు.
బాలికకు ఆరేళ్ల వయసున్నప్పుడే పూజారి భార్య కావడానికి అవసరమైన ఆచారాలు ప్రారంభమయ్యాయని, అయితే, ఈ ప్రక్రియ ఆమె చదువుకు ఆటంకం కలిగించలేదని చెబుతున్నారు. ఆడపిల్లకు సంతానం కలగడంతోపాటు వైవాహిక బాధ్యతలకు ఆమెను సిద్ధం చేసేందుకు రెండో సంప్రదాయ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమవుతుండడం విశేషం. దేశవ్యాప్తంగా ఈ వివాహంపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలికను రక్షించి తమ అధీనంలోకి తీసుకున్నారు.