Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన పట్టాభి

Pattabhi gives clarity on Raghu Rama Krishna Raju being contest in elections

  • రఘురామ టీడీపీలో చేరుతున్నారంటూ కథనాలు
  • ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు
  • మరి కొన్ని గంటల్లో ఎన్నికల సమరంలోకి అడుగుపెడుతున్న రఘురామ అంటూ పట్టాభి ట్వీట్

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైనట్టు తెలుస్తోంది. నిన్న చంద్రబాబును కలిసిన రఘురామకృష్ణరాజు పార్టీలో చేరే అంశమై చర్చించగా, చంద్రబాబు ఆయనకు టికెట్ పై భరోసా ఇచ్చినట్టు సమాచారం. సమీకరణాలు, పరిస్థితులు అన్నీ కుదిరితే రఘురామ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

ఇక, రఘురామకృష్ణరాజు ఎన్నికల్లో పోటీ చేయడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. విజయవాడలో రఘురామతో కలిసున్న ఫొటోను పోస్టు చేసిన పట్టాభి... "మరి కొన్ని గంటల్లో ఎన్నికల సమరంలోకి అడుగుపెడుతున్న మా అగ్రజులు రఘురామకృష్ణరాజు గారితో ఈ ఉదయం విజయవాడలో" అంటూ ట్వీట్ చేశారు. రఘురామ టీడీపీలో చేరనుండడం, ఆయనకు టికెట్ లభించడం ఖాయమేనని పట్టాభి తాజా పోస్టు స్పష్టం చేస్తోంది. 

కొన్నిరోజుల కిందటే వైసీపీకి రాజీనామా చేసిన రఘురామ... టీడీపీ, జనసేన, బీజేపీలలో ఏదో ఒక పార్టీ టికెట్ ఇస్తుందిలే అని భావించారు. కానీ, ఆ మూడు పార్టీలు జాబితాలు ప్రకటించినా, వాటిలో రఘురామకు మొండిచేయి చూపాయి. 

అయితే, రఘురామ ఈ సమయంలో ఎంతో హుందాగా వ్యవహరించారు. వాటిలో ఏ ఒక్క పార్టీని దూషించకపోగా, తాను ఎన్నికల్లో దిగుతానన్న నమ్మకాన్ని చివరి వరకు వ్యక్తం చేశారు. చంద్రబాబు వంటి గొప్ప వ్యక్తి సీఎం అవ్వాలన్నదే తన కోరిక అని పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చారు.

కాగా, ఉండి స్థానానికి టీడీపీ ఇప్పటికే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది. మరి ఉండిలో అభ్యర్థిని మార్చుతారా, లేక, రఘురామకు ఇంకెక్కడైనా సర్దుబాటు చేస్తారా అనేది చూడాలి.

  • Loading...

More Telugu News