Special Plane: రెండ్రోజులుగా బెంగళూరు నగరంపై చక్కర్లు కొడుతున్న భారీ విమానం
- బెంగళూరులో అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం
- స్థానికుల్లో చర్చనీయాంశంగా మారిన వైనం
- ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్న రాష్ట్రపతి, ప్రధాని
- ఎన్నికల కోడ్ కారణంగా రెండు నెలల పాటు ఈ విమానాలకు విశ్రాంతి
- ఇంజిన్లను కండిషన్ లో ఉంచేందుకే ఇలా చక్కర్లు కొడుతున్నట్టు కథనాలు
గత రెండ్రోజులుగా బెంగళూరు నగరంపై అతి తక్కువ ఎత్తులో ఓ భారీ విమానం చక్కర్లు కొడుతుండడం నగరవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, కొరమంగళ ప్రాంతంలోని గగనతలంలో ఈ విమానం దర్శనమిస్తోంది. అసలే భారీ విమానం... దానికి తోడు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండడంతో అందరి దృష్టిలో పడింది.
ఈ విమానం ప్రతి రోజు ఇక్కడి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఎయిర్ పోర్టుపై ఆరుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లిపోతున్నట్టు స్థానికులు గుర్తించారు. బెంగళూరు వాసులు దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
అయితే, ఈ విమానం సంగతి ఏంటనేది ఫ్లైట్ రాడార్24 అనే వెబ్ సైట్ వెల్లడించింది. ఇది భారత రాష్ట్రపతి, ప్రధాని ఉపయోగించే ప్రత్యేక విమానం అని, ఇది బోయింగ్ 777-337 రకానికి చెందిన విమానం అని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వద్ద ఇలాంటి ప్రత్యేక విమానాలు రెండు ఉన్నాయని వెల్లడించింది.
దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వ పెద్దలు ఈ విమానాలను మరో రెండు నెలల పాటు ఉపయోగించే అవసరం ఉండదు. అందువల్ల వీటి ఇంజిన్లను కండిషన్లో ఉంచేందుకు ఇలా బెంగళూరు వరకు తీసుకువస్తున్నారని, ఈ ప్రత్యేక విమానాలను నడపడంలో పైలెట్లకు తగిన శిక్షణ ఇచ్చేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ భారీ విమానం తక్కువ ఎత్తులోకి వస్తోంది కానీ ల్యాండ్ కాకుండానే వెళ్లిపోతోందని స్థానికులు చెబుతున్నారు.