Nara Bhuvaneswari: పెన్షన్లు ఇవ్వడం చేతకాక చంద్రబాబుపై విషప్రచారం చేస్తున్నారు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari come into support for Chandrababu in pensions issue
  • నంద్యాలలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
  • టీడీపీ కార్యకర్త అబ్దుల్ రహీమ్ కుటుంబానికి పరామర్శ
  • వైసీపీ వైఫల్యాలను చంద్రబాబుకు ఆపాదిస్తున్నారంటూ భువనేశ్వరి ఆగ్రహం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఇవాళ నంద్యాల నియోజకవర్గంలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు. నంద్యాల పట్టణం, వెంకటాచలం కాలనీ, 34వ వార్డులో కార్యకర్త అబ్దుల్ రహీమ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అక్కడ తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి నారా భువనేశ్వరి ప్రసంగించారు. 

వైసీపీ ప్రభుత్వం తమ వైఫల్యాలను చంద్రబాబుకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం చేతకాక చంద్రబాబు పెన్షన్లు నిలిపేశారని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.   రాత్రింబవళ్లు కష్టపడే తత్వం ఉన్న చంద్రబాబుతో రాష్ట్ర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేయి చేయి కలిపి టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  

"పేద ప్రజలకు ఆకలి అనేది తెలియకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కిలో బియ్యం రూ.2కే ఇస్తే... చంద్రబాబు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్లలో ఒక్క ఏడాదిలోనే 7.5 కోట్ల మంది భోజనం చేశారు. ఇలాంటి అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా మూతవేసి పేదవాళ్ల కడుపు కొట్టింది. అయినా సరే టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు. అన్న క్యాంటీన్లు నడుపుతున్న ప్రతి ఒక్కరికీ నా నమస్కారాలు... కృతజ్ఞతలు.

చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి అనేక కంపెనీలు, పెట్టుబడులు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరికేలా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు... ఏపీ నుండి కంపెనీలు ప్రక్కనున్న రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయి. 

వైసీపీ రాక్షస పాలనలో ఏపీని గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారు. గంజాయిని మహిళలకు అలవాటు చేసి, ఆ మత్తులో ఉన్న మహిళలపై వైసీపీ దుర్మార్గులు అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాలి. మన ఇంటి బిడ్డకు ఇలా జరిగితే ఏమవుతుందో ఆలోచించి వైసీపీ దుర్మార్గాలపై తిరుగుబాటు చేయాలి.

రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని వైసీపీ ఏరులై పారిస్తోంది. కల్తీ మద్యం తాగిన వారు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. మహిళల మాంగల్యాలు మంటగలుస్తున్నాయి. కుటుంబం ముందుకు నడవాలంటే తండ్రి ఉండాలి... కానీ ఆ తండ్రి కల్తీ మద్యం తాగి చనిపోతే ఆ కుటుంబం ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలి. 

అడ్డగోలుగా పన్నులు వేసి, పేద, మధ్యతరగతి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెంచి పేదవాడికి పట్టెడన్నం దొరక్కుండా చేస్తున్నారు" అంటూ  భువనేశ్వరి మండిపడ్డారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారు: భువనేశ్వరి

•    నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు... ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల రూ.3వేల నిరుద్యోగ భృతి అందిస్తారు.
•    రైతులకు ప్రతియేటా రూ.20 వేలు పెట్టుబడి సాయం.
•    18 ఏళ్లు నిండిన మహిళకు ప్రతి నెల రూ.1,500 ఆర్థికసాయం.
•    చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 అందిస్తారు.
•    పేదవాళ్లకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తారు.
•    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తారు.

మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతో చంద్రబాబు అనేక పథకాలు తెచ్చారు..దానిలో భాగమే డ్వాక్రా. అన్ని వర్గాలను ఆదుకునేందుకు, వారిని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నిరంతరం శ్రమిస్తారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం... ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి స్వాగతం పలుకుదాం... అంటూ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Nara Bhuvaneswari
Chandrababu
Pensions
Nijam Gelavali Yatra
Nandyal
TDP
Andhra Pradesh

More Telugu News