Etela Rajender: కేకేను కాంగ్రెస్‌లోకి తీసుకోవడంపై రేవంత్ రెడ్డిని నిలదీసిన ఈటల రాజేందర్
- మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కేటాయించలేదని విమర్శ
- ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరేవారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేసిన ఈటల
- కడియం శ్రీహరి దళితుడే కాదని ఇప్పుడు ఆయన కూతురుకు టిక్కెట్ ఎలా ఇచ్చారని నిలదీత
పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు ఈ వయస్సులో ఇదేం బుద్ది అని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కె.కేశవరావును పార్టీలోకి ఎలా తీసుకున్నారు? అని బీజేపీ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 11 శాతం జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కేటాయించలేదని విమర్శించారు. కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి దానం నాగేందర్ ను ఎలా చేర్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. కడియం శ్రీహరి దళితుడే కాదని ఇప్పుడు ఆయన కూతురుకు టిక్కెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... అధికారంలో లేనప్పుడు ఒకలా... వచ్చాక మరోలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటి వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. మల్కాజ్‌గిరిలో బీజేపీ గెలుపు ఖాయమని, కేంద్రంలో 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాని కోసం చేసిందేమీ లేదన్నారు. మల్కాజ్‌గిరిలో అన్ని సంఘాల మద్దతు బీజేపీకే ఉందన్నారు. ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా రాదన్నారు.
ప్రధాని మోదీని కలిసి నిధులు తీసుకొచ్చి, అభివృద్ధి చేసే సత్తా తనకుందని... ప్రజలు కూడా ఇదే నమ్ముతున్నారన్నారు. నరేంద్ర మోదీకి హిందుత్వాన్ని అంటగట్టి ప్రతిపక్షాలు ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ తీసేస్తే ముస్లిం మహిళలకు లాభం జరిగిందన్నారు. తద్వారా వారికి కూడా ప్రధాని మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. బీజేపీలో నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని... విజయం సాధిస్తామన్నారు.