BRS: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎంబీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్

BRS leader joins bjp in the presence of kishan reddy
  • తాడూరి శ్రీనివాస్‌తో పాటు బీజేపీలో చేరిన పలువురు బీఆర్ఎస్ ఉప్పల్ నాయకులు
  • వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి
ఎంబీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి... బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కమలం పార్టీ జెండాను కప్పుకున్నారు. వారికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్, రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని చెప్పారని... కానీ ఆ పార్టీకి ఇంకా గడువు పూర్తయినట్లుగా లేదని ఎద్దేవా చేశారు.

కాగా, తాడూరి శ్రీనివాస్ ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపించారు. పార్టీలో తనకు గుర్తింపు లేనందునే పార్టీని వీడుతున్నట్లు అందులో పేర్కొన్నారు.
BRS
BJP
Lok Sabha Polls
G. Kishan Reddy

More Telugu News