Raghu Rama Krishna Raju: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju joins TDP
  • పాలకొల్లులో ప్రజాగళం సభ
  • రఘురామను టీడీపీలో చేర్చుకుంటున్నట్టు స్వయంగా ప్రకటించిన చంద్రబాబు
  • సభ ప్రారంభానికి ముందే రఘురామకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు
వైసీపీ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో రఘురామకృష్ణరాజు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన నేత రఘురామకృష్ణరాజు అని కొనియాడారు. ప్రజలందరి ఆమోదంతో ఆయనను ఇవాళ పాలకొల్లు సభ ద్వారా తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నామని అన్నారు. 

"మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం... ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేశాడు దుర్మార్గుడు... ఇది ఆమోదయోగ్యమా? ఏమిటీ అరాచక పాలన? ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇష్టానుసారం చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు రాత్రంతా నేను మేలుకునే ఉన్నాను. భారత రాష్ట్రపతికి, గవర్నర్ కు విన్నవించాం... కోర్టులో అన్ని విధాలా ప్రయత్నాలు చేశాం... చివరికి కోర్టు జోక్యం చేసుకోవడంతో ఆయన బయటపడ్డాడు... లేకపోతే ఇవాళ మీరు రఘురామకృష్ణరాజును చూసేవారు కాదు. 

ఒక దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇలాంటి వ్యక్తులను కూడా కలుపుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే రఘురామను మనస్ఫూర్తిగా టీడీపీలో చేర్చుకుంటున్నాం" అని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
Raghu Rama Krishna Raju
TDP
Chandrababu
Palakollu
Praja Galam

More Telugu News