SRH: చెన్నైను చిత్తుగా ఓడించారు... ఉప్పల్ లో సన్ రైజర్స్ విన్నర్

SRH beat CSK by 6 wickets

  • సొంతగడ్డపై అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ
  • చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం
  • 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించిన సన్ రైజర్స్
  • ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చిన కమిన్స్ సేన 

ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతగడ్డపై అదరగొట్టింది. ఐపీఎల్ టోర్నీలో బలమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ను ఉప్పల్ స్టేడియంలో 6 వికెట్ల తేడాతో అలవోకగా ఓడించింది. చివర్లో తెలుగుతేజం నితీశ్ రెడ్డి ఓ భారీ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించడం హైలైట్ గా నిలిచింది. 

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. అనంతరం, ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన సన్ రైజర్స్ కేవలం 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి విజయభేరి మోగించింది. 

హైదరాబాద్ జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ (37), ట్రావిస్ హెడ్ (31) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వన్ డౌన్ లో వచ్చిన మాజీ కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ (50) అర్ధసెంచరీతో జట్టు విజయానికి బాటలు పరిచాడు. షాబాజ్ అహ్మద్ 18, హెన్రిచ్ క్లాసెన్ 10 (నాటౌట్), నితీశ్ రెడ్డి 14 (నాటౌట్) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2, దీపక్ చహర్ 1, మహీశ్ తీక్షణ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు భారీగా తరలి రావడంతో, మ్యాచ్ జరుగుతోందా హైదరాబాద్ లోనా, లేక చెన్నైలోనా అనే సందేహం కలిగించేలా ఉప్పల్ స్టేడియం పసుపుమయం అయింది. కానీ, ఆరెంజ్ ఆర్మీ దెబ్బకు సూపర్ కింగ్స్ ఢీలాపడిపోయారు. ఈ మ్యాచ్ కు ముందు, మ్యాచ్ జరుగుతున్నంతసేపు ధోనీ చుట్టూ భారీ హైప్ నెలకొన్నా, ఈ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 

ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు ఛండీగఢ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలవనుంది.

  • Loading...

More Telugu News