America: అమెరికాలో విషాదం.. తెలుగు విద్యార్థి మృతి... ఈ ఏడాది 10వ ఘటన
- ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్ లో కన్నుమూత
- మరణానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపిన భారత కాన్సులేట్
- మృతదేహం తరలింపునకు సాయం చేస్తామని భరోసా ఇచ్చిన అధికారులు
- 2024లో ఇప్పటివరకు అమెరికాలో 10 మంది భారతీయ విద్యార్థులు మృతి
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్య సాయి గద్దె అనే తెలుగు విద్యార్థి చనిపోయాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించింది. సత్య సాయి క్లీవ్‌ల్యాండ్‌లో విద్యనభ్యసిస్తున్నాడని, అయితే అతడి మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని భారత కాన్సులేట్ పేర్కొంది. విద్యార్థి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, మృతుడి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని తెలిపింది. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సహాయాన్ని అందజేయనున్నట్టు భరోసా ఇచ్చింది.
పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని, వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని భారత కాన్సులేట్ తెలిపింది. మరోవైపు సత్య సాయి కుటుంబ సభ్యులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు. కాగా సత్యసాయికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజా ఘటనతో కలిపి 2024 ఆరంభం నుంచి ఇప్పటివరకు అమెరికాలో 10 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
గత నెల మార్చిలో మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే మరో భారతీయ విద్యార్థి క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. డబ్బు చెల్లిస్తే అతడిని విడుదల చేస్తామంటూ కుటంబానికి బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆరంభంలో చికాగోలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి సయ్యద్ అలీపై దాడి, ఇండియానాలోని పర్డ్యూ యూనివర్శిటీలో విద్యార్థి నీల్ ఆచార్య మృతి, జార్జియాలో వివేక్ సైనీ హత్య తీవ్ర ఆందోళనలు రేకెత్తించిన విషయం తెలిసిందే.