India: భారత్‌లో ఉగ్ర చర్యలకు పాల్పడితే వదిలిపెట్టం.. పాక్‌లోకి ప్రవేశించి మరీ చంపేస్తాం: రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరిక

India Will Enter Pak To Kill Terrorists Who Flee borders warns Rajnath Singh
  • పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకుంటామన్న రక్షణమంత్రి
  • ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ పదేపదే కవ్విస్తే వదిలేది లేదని హెచ్చరిక
  • ఉగ్రవాదులను హెచ్చరించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు యత్నించి సరిహద్దులు దాటి పారిపోయిన వారిని వదిలిపెట్టేదేలేదని, అలాంటి తీవ్రవాదులను అంతమొందించేందుకు పాకిస్థాన్‌లోకి భారత్ ప్రవేశిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోయినా వారిని ఏరివేసేందుకు పాక్‌లోకి ప్రవేశిస్తామని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని అన్నారు. అయితే పదే పదే కవ్విస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే మాత్రం విడిచిపెట్టే ప్రసక్తేలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విస్తృత ప్రణాళికలో భాగంగా విదేశీ గడ్డపై ఉగ్రవాదులను భారత్ ఏరివేస్తోందని, 2020 నుంచి పాకిస్థాన్‌లో 20 మందిని మట్టుబెట్టిందంటూ బ్రిటన్‌కు చెందిన ‘గార్డియన్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కథనంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కూడా స్పందించేందుకు నిరాకరించింది. కాగా 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడి తర్వాత భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

కెనడా, అమెరికాలోని ఖలిస్థానీ టెర్రిరిస్టులను భారత్ చంపేస్తోందని, అంతమొందించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల తర్వాత గార్డియన్‌ పత్రికలో ఈ కథనం వెలువడింది. ఈ ఏడాది ఆరంభంలో తమ భూభాగంపై ఇద్దరు పౌరుల హత్యలో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని పాకిస్థాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అయితే పాక్ చేసిన ఈ ప్రకటనను భారత్ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని తిప్పికొట్టింది.
India
Pakistan
Rajnath Singh
Terrorist

More Telugu News