Dokka Manikya Vara Prasad: వైసీపీతో అంటీముట్టనట్టుగా డొక్కా.. త్వరలో టీడీపీ గూటికి!
- వైసీపీని వీడుతున్నట్టు జోరుగా ప్రచారం
- డొక్కా ఇంటికి వెళ్లి చర్చించిన మంత్రి అంబటి రాంబాబు
- పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ
- అయినా పార్టీ నుంచి స్పష్టంగా రాని హామీ
- పార్టీ కార్యక్రమాలకు దూరంగా డొక్కా
గత కొంతకాలంగా వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి అంబటి రాంబాబు నిన్న సాయంత్రం డొక్కా ఇంటికి వెళ్లి చర్చించారు. పార్టీని వీడొద్దని, పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. అయితే, పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డొక్కా అలక వీడలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన డొక్కాకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ పార్టీలో తనకు ప్రాధాన్యం కరవైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. తనను సంప్రదించకుండానే తాడికొండ ఇన్చార్జిగా నియమించడం డొక్కాను తీవ్రంగా నిరాశపరిచింది. తరువాత తనను ఆ బాధ్యతల నుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పటికీ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.