Nara Lokesh: అధికారంలోకి రాగానే ఉద్యోగులకు బకాయిలను విడతల వారీగా చెల్లిస్తాం: నారా లోకేశ్
- సీఎం జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని నట్టేట ముంచారన్న టీడీపీ నేత
- వైసీపీ ప్రభుత్వం హయాంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపాటు
- మంగళగిరిని అభివృద్ధి చేయాలంటే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలన్న లోకేశ్
శనివారం తాడేపల్లిలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అక్కడి పూజిత అపార్టుమెంట్ వాసులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని నట్టేట ముంచారని దుయ్యబట్టారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగులకు బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని, నెలాఖరునే జీతాలు చెల్లించారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మంగళగిరిని అభివృద్ధి చేయాలంటే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. 2019లో ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో.. తిరిగి అక్కడి నుంచి ప్రారంభిస్తామని లోకేశ్ చెప్పుకొచ్చారు.