Rishi Sunak: జిమ్మీ ఆండర్సన్ బౌలింగ్‌లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నెట్ ప్రాక్టీస్! వీడియో ఇదిగో!

Rishi Sunak takes guard against England pacer Jimmy Anderson displays his batting skills
  • ఇంగ్లండ్ జాతీయ జట్టులో చేరిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
  • జిమ్మీ ఆండర్సన్ బౌలింగ్‌లో నెట్ ప్రాక్టీస్ చేసిన వైనం
  • ప్రాక్టీస్ సందర్భంగా తనను క్లీన్ బౌల్డ్ చేసి యువ బౌలర్‌పై ప్రధాని ప్రశంసలు
  • నెట్టింట వీడియో షేర్ చేసిన వైనం
క్రికెట్ వీరాభిమాని అయిన భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి క్రీడపై తన అభిమానాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఆయన ఇంగ్లండ్ జాతీయ జట్టులో చేరారు. అంతేకాకుండా, నెట్ సెషన్లలో కూడా పాల్గొన్న ఆయన తన బ్యాటింగ్ నైపుణ్యాలతో అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జిమ్మీ ఆండర్సన్ బౌలింగ్‌లో నెట్ ప్రాక్టీస్ చేయడంపై రిషి హర్షం వ్యక్తం చేశారు. జిమ్మీ ఆండర్సన్ ఇటీవలే టెస్టు క్రికెట్లో 700 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 

నెట్ ప్రాక్టీస్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని..జిమ్మీ ఆండర్సన్‌తో ముచ్చటించారు. జిమ్మీ బౌలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసే తాను గత వారం కొంతసేపు అక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్లానన్నారు. తనకు మరీ దూకుడుగా బౌలింగ్ చేయొద్దని కూడా రిషి సరదాగా సూచించారు. మరోవైపు, టీంలోని యువ క్రీడాకారులతో కూడా ఆయన ముచ్చటించారు. అనేక మంది బాలబాలికలు రిషి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. చిన్నారుల బౌలింగ్‌లో కూడా నెట్ ప్రాక్టీస్ చేసిన ఆయన, ఓ చిన్నారి వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ కూడా అయ్యారు. తనను బౌల్డ్ చేసిన బాలుడిపై ప్రశంసలు కురిపించారు. అనంతరం, తన నెట్ ప్రాక్టీస్ సెషన్ తాలూకు వీడియోను నెట్టింట పంచుకున్న ఆయన తన బ్యాటింగ్ ఎలా ఉందని ఇంగ్లండ్ క్రికెట్‌ టీంను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అంతా బాగానే ఉంది, కానీ మరికొన్ని నెట్ సెషన్లు అవసరమవుతాయని ఇంగ్లండ్ టీం సరదాగా రిప్లై ఇచ్చింది. 

కాగా, దేశంలోని 9 లక్షల యువ క్రీడాకారులకు లాభించేలా క్రికెట్ అభివృద్ధికి 35 మిలియన్ పౌండ్లు వెచ్చించనున్నట్టు సునాక్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇందులో కొంత మొత్తాన్ని స్టేడియాల్లో ఆల్-వెదర్ డోమ్స్ నిర్మాణానికి వెచ్చిస్తామని పేర్కొంది. 2026లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 కప్‌కు ఇంగ్లండ్, వేల్స్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. 2030లో జరగనున్న పురుషుల టీ20 టోర్నీకి యూకే, ఐర్లాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.
Rishi Sunak
Team England
Viral Videos
UK

More Telugu News