Virat Kohli: రాజస్థాన్‌పై సెంచరీతో విరాట్ కోహ్లీ ఖాతాలో అవాంఛిత రికార్డు.. తీవ్ర విమర్శలు

Virat Kohli century came in 67 balls which is the joint slowest IPL ton ever

  • ఐపీఎల్‌లో సెంచరీ కోసం అత్యధిక బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన కోహ్లీ
  • మనీశ్ పాండేతో కలిసి రికార్డు పంచుకున్న విరాట్
  • శతకం కోసం 67 బంతులు ఆడిన స్టార్ బ్యాట్స్‌మెన్
  • నెమ్మదిగా ఆడాడంటూ మండిపడుతున్న పలువురు నెటిజన్లు

ఐపీఎల్ 2024లో భాగంగా జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. 72 బంతులు ఆడి 113 పరుగులు బాదాడు. దీంతో రికార్డు స్థాయిలో ఎనిమిదవ శతకాన్ని అందుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో కోహ్లీకి అత్యధిక స్కోర్ కూడా ఇదే. అంతేకాదు ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో 7,500 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఈ మార్క్‌ను అధిగమించిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. అయితే ఈ రికార్డులతో పాటు ఎప్పటికీ మరచిపోలేని ఓ చెత్త రికార్డును కూడా కోహ్లీ తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. 

విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసేందుకు ఏకంగా 67 బంతులు ఆడాడు. దీంతో ఐపీఎల్‌లో సెంచరీ పూర్తి చేసేందుకు ఎక్కువ బంతులు ఆడిన ఆటగాడిగా విరాట్ నిలిచారు. మనీశ్ పాండేతో కలిసి ఈ రికార్డును సంయుక్తంగా పంచుకున్నాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్‌పై ఆర్సీబీ తరపున ఆడిన మనీశ్ పాండే కూడా 67 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు.

కాగా గత రాత్రి రాజస్థాన్‌పై మ్యాచ్‌లో కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ స్ట్రైక్ రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం విమర్శలకు దారితీసింది. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎదుర్కొనేందుకు కోహ్లీ ఆపసోపాలు పడ్డాడు. భారీ షాట్లు ఆడలేకపోయాడు. అయితే చివరి వరకు క్రీజులో ఉండాలన్న వ్యూహాన్ని అమలు చేశానని కోహ్లీ సమర్థించుకున్నాడు.

కాగా కోహ్లీ ఇన్నింగ్స్‌పై విమర్శలు వస్తున్నాయి. నెమ్మదిగా ఆడాడంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. చివరి ఓవర్‌లో భారీ షాట్లు ఆడకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వేగంగా ఆడివుంటే మరిన్ని పరుగులు వచ్చేవని విమర్శిస్తున్నారు. కాగా గత రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ తిరుగులేని విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఫినిష్ చేసింది.

  • Loading...

More Telugu News