Jharkhand: 71 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటు వేయనున్న వృద్ధుడు
- ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
- 1953లో జన్మించినా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఓటు వేయని అన్సారీ
- అన్సారీ పేరు ఓటర్ల జాబితాలోకి ఎక్కలేదన్న ఎన్నికల అధికారి
ఝార్ఖండ్‌కు చెందిన 71 ఏళ్ల వృద్ధుడు త్వరలో తొలిసారిగా ఓటు వేయనున్నారు. సాహిబ్‌గంజ్ జిల్లా బాడ్ఖోరీ గ్రామానికి చెందిన ఖలీల్ అన్సారీ 1953లో జనవరి 1న అంటే.. భారత తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఏడాది తరువాత జన్మించారు. కంటిచూపునకు నోచుకోని అన్సారీ ఇప్పటివరకూ ఒక్కసారిగా కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు.
ప్రభుత్వ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఝార్ఖండ్ ప్రధాని ఎన్నికల అధికారి కె.రవి కుమార్ ఇటీవల అన్సారీ ఉంటున్న గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధుడి విషయం ఆయన దృష్టికి వచ్చింది. తనిఖీల సందర్భంగా అన్సారీ పేరు ఎక్కడా ఓటర్ల లిస్టులో కనబడలేదని కుమార్ తెలిపారు. దీనర్థం..అన్సారీ ఇప్పటివరకూ ఒక్కసారిగా కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదని అయన అన్నారు. మరోవైపు, తొలిసారిగా ఓటు వేసే అవకాశం దక్కినందుకు అన్సారీ మిక్కిలి హర్షం వ్యక్తం చేశారు. జూన్ 1న స్థానిక రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆయన ఓటు వేయనున్నారు.