Air India Flight: అధ్వానం.. ఎయిర్ ఇండియా సేవలపై ప్రయాణికుడు ఫైర్.. వీడియో ఇదిగో!
- విండో సీట్ కావాలంటే రూ. వెయ్యి అదనంగా ఛార్జ్ చేశారని ఆరోపణ
- తీరా ఫ్లైట్ ఎక్కాక విరిగిన కుర్చీ ఇచ్చారని మండిపాటు
- ఎక్స్ ట్రా చెల్లించి మరీ విరిగిన సీటు తీసుకోవాల్సి వచ్చిందంటూ ట్వీట్
విమాన ప్రయాణంలో విండో సీట్లో కూర్చోవాలని చాలామంది కోరుకుంటారు.. ఈ కోరికను సొమ్ము చేసుకోవడానికి కంపెనీలు విండో సీట్ కోసం అదనంగా వసూలు చేస్తుంటాయి. టికెట్ బుకింగ్ సమయంలోనే సీట్ ప్రిఫరెన్స్ కోసం ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా అదనంగా చెల్లించి విమానం ఎక్కాక తీరా సీటు విరిగిపోయి ఉంటే..? అదే సీట్లో కూర్చుని ప్రయాణం చేయాల్సి వస్తే..? ఎదురు డబ్బులిచ్చి మరీ దరిద్రాన్ని కొనుక్కున్నట్లే కదా.. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ ప్రయాణికుడికి ఎదురైంది. ఈ నెల 4న బెంగళూరు వెళ్లేందుకు ఢిల్లీలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన ఓ వ్యక్తి తనకు ఎదురైన పరిస్థితిని ట్విట్టర్ లో పంచుకున్నాడు.
విండో సీటు కోసం తన దగ్గర రూ. వెయ్యి అదనంగా వసూలు చేశారని సదరు ట్విట్టర్ యూజర్ చెప్పాడు. సరే, డబ్బులు ఖర్చయినా సౌకర్యంగా ప్రయాణించవచ్చు కదా అనే ఉద్దేశంతో విండో సీటు కొనుక్కున్నానని వివరించాడు. అయితే, విమానం ఎక్కాక తన సీటు కాస్తా విరిగిపోయి కనిపించిందని చెప్పాడు. వెంటనే ఫ్లైట్ సిబ్బందికి చెప్పగా.. వారు ఇంజనీర్ ను పిలిపించారని, అయినా సీటును బాగు చేయలేకపోయారని అన్నాడు. దీంతో తాను ఢిల్లీ నుంచి బెంగళూరు వరకూ ఆ విరిగిన సీట్లోనే అవస్థపడుతూ ప్రయాణించానని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఎయిర్ ఇండియా స్పందించింది. టికెట్ వివరాలు అడిగి తెలుసుకుని విచారిస్తామని జవాబిచ్చింది. కాగా, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.