KTR: జనజాతర కాదది హామీల పాతర.. కాంగ్రెస్ సభపై కేటీఆర్ విమర్శ

KTR Fires on Congress party sabha in tukkuguda

  • అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల పేరుతో గారడీ
  • పార్లమెంట్ ఎన్నికలకు న్యాయ్ పేరుతో నాటకాలు
  • 4 కోట్ల తెలంగాణ ప్రజలను 4 నెలలుగా నయవంచన
  • కాంగ్రెస్ పార్టీపై కవితాత్మకంగా విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు న్యాయ్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన సభపై విమర్శల వర్షం కురిపించారు. జనజాతర కాదది ప్రజలకు ఇచ్చిన హామీల పాతర, అబద్ధాల జాతర సభ అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ జీ.. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన మీరు ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. అబద్ధపు హామీలను నమ్మి ఓటేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలుగా నయవంచనకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను ఆత్మహత్యలకు, నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోందని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసమర్థ పాలన వల్ల సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రుణమాఫీ చేయకపోవడంతో అన్నదాతలు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం గోస పడుతున్న జనం మీ మోసాలపై మండిపడుతున్నారు అని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అంటూ నిలదీశారు. చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా? రుణమాఫీపై సర్కారును నిలదీయరా అంటూ ప్రశ్నించారు. సకల రంగాలను సంక్షోభంలోకి నెట్టిన భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే.. నిండా మునగడం ఖాయమని తేలిపోయిందన్నారు. అందుకే.. వందరోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని కేటీఆర్ చెప్పారు. జై తెలంగాణ అంటూ తన ట్వీట్ ను ముగించారు.

  • Loading...

More Telugu News