Lok Sabha Polls: రాహుల్ గాంధీకి సలహా ఇచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
- లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోతే రాహుల్ వెనక్కి తగ్గాలన్న పీకే
- వేరేవారికి అవకాశం ఇవ్వాలని సూచన
- రాహుల్ 10 ఏళ్లపాటు ప్రయోగాలు చేసినా పార్టీకి ప్రయోజనం దక్కలేదన్న ప్రశాంత్ కిశోర్
లోక్సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోతే వెనక్కి తగ్గే విషయాన్ని రాహుల్ గాంధీ పరిశీలించాలని పీకే సూచించారు. ఆచరణాత్మక ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నారని అన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మేలు జరగకపోయినప్పటికీ రాహుల్ పక్కకు తప్పుకోవడం లేదు, పార్టీని నడిపించే అవకాశం ఇతరులెవరికీ ఇవ్వడంలేదని అన్నారు. ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధమనేది తన అభిప్రాయమని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.
విజయం లేకుండా గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న రాహుల్ గాంధీ విరామం తీసుకోవడం వల్ల నష్టం లేదని వ్యాఖ్యానించారు. ఒక 5 సంవత్సరాలపాటు వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలని సూచించారు. సోనియా గాంధీ ఇదే చేశారని అన్నారు. 1991లో తన భర్త రాజీవ్ గాంధీ హత్య అనంతరం రాజకీయాలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని, పార్టీ బాధ్యతలను పీవీ నరసింహారావుకు అప్పగించాలని నిర్ణయించారని ప్రశాంత్ కిశోర్ గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ తనకుఅన్నీ తెలుసునని భావిస్తుంటారని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. ఇతరుల సాయం అవసరమని గుర్తించకపోతే ఎవరూ వచ్చి సహాయం చేయలేరని అన్నారు. తాను అనుకున్నదే కరెక్ట్ అని రాహుల్ భావిస్తుంటారని, ఇతరులు దానిని అమలు చేయాలని కోరుకుంటుంటారని, కానీ అది సాధ్యమయ్యేది కాదని పీకే వ్యాఖ్యానించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ ఇతరులకు అవకాశం ఇస్తాననే సందేశం ఇచ్చారని, కానీ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని పీకే వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా కాంగ్రెస్ పునరుజ్జీవనం కోసం ప్రశాంత్ కిశోర్ గతంలో ప్రణాళిక అందించారు. అయితే ఆ వ్యూహాలను అమలు చేసేందుకు హస్తం పార్టీ విముఖత వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా కొనసాగలేనని తప్పుకున్న విషయం తెలిసిందే.