Mumbai Indians: అన్ని ఓవర్లు ఒకెత్తు... చివరి ఓవర్ మరో ఎత్తు... ముంబయి ఇండియన్స్ రికార్డు స్కోరు
- వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు
- సొంతగడ్డపై ముంబయి జట్టుకు ఇదే హయ్యస్ట్ టోటల్
- ఆఖరి ఓవర్లో 32 పరుగులు చేసిన రొమారియో షెపర్డ్
- 2 ఫోర్లు, 4 సిక్సర్లతో వీరవిహారం
ఐపీఎల్ తాజా సీజన్ లో తొలి గెలుపు నమోదు చేయాలన్న కసితో ఉన్న ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు ఇవాళ వీరవిహారం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల రికార్డు స్కోరు చేసింది. సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో ముంబయి జట్టుకు ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు.
రొమారియా షెపర్డ్ ఆఖరి ఓవర్లో విశ్వరూపం ప్రదర్శించడం ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ కు హైలెట్ గా నిలిచింది. అన్ని ఓవర్లు ఒకెత్తయితే, ఆ ఒక్క ఆఖరి ఓవర్ మరో ఎత్తు అని చెప్పాలి.
19 ఓవర్లు ముగిసేసరికి ముంబయి ఇండియన్స్ స్కోరు 5 వికెట్లకు 202 పరుగులు. ఆఖరి ఓవర్లో రొమారియో షెపర్డ్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాగా... ఆ వెస్టిండీస్ బ్యాట్స్ మన్ ఏకంగా 2 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలర్ ఆన్రిచ్ నోర్కియాకు చుక్కలు చూపించాడు. షెపర్డ్ కండబలంతో ఆ ఓవర్లో ప్రతి బంతి బౌండరీ దాటింది.
షెపర్డ్ ఆ విధంగా చితక్కొడుతుంటే ముంబయి శిబిరంలో ఉత్సాహం మిన్నంటింది. ముఖ్యంగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముఖం నవ్వుతో వెలిగిపోయింది. షెపర్డ్ విజృంభణకు 20వ ఓవర్లో మొత్తం 32 పరుగులు లభించాయి.
షెపర్డ్ ఓవరాల్ గా 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో టీ20 స్పెషలిస్ట్ టిమ్ డేవిడ్ కూడా ఢిల్లీ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అంతకుముందు, ముంబయి ఇండియన్స్ కు అదిరేటి ఆరంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పోటాపోటీగా బాదడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 7 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 49 పరుగులు చేయగా... ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేశాడు.
చాన్నాళ్ల తర్వాత క్రికెట్ బ్యాట్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యాడు. నోర్కియా బౌలింగ్ లో భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చాడు. ఇక, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 39 పరుగులు చేశాడు. తెలుగుతేజం తిలక్ వర్మ (6) విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, నోర్కియా 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశారు.