Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ పై జూపల్లి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా నవ్వొస్తోంది: ప్రవీణ్ కుమార్
- తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్
- మంత్రుల ప్రెస్ మీట్ పై ప్రవీణ్ కుమార్ స్పందన
- జూపల్లికి ట్యాపింగ్ పై కనీస అవగాహన లేదని విమర్శలు
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా, ఫోన్ ట్యాపింగ్ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మంత్రి జూపల్లి వ్యాఖ్యలు హాస్యాస్పదం అంటూ కొట్టిపారేశారు. ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చూస్తే నిజంగానే నవ్వొస్తోందని తెలిపారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
"ఇద్దరు వ్యక్తులకు మధ్య జరిగే ఫోన్ సంభాషణను వాళ్లకు తెలియకుండా మూడో వ్యక్తి లేదా సంస్థ విని రికార్డు చేస్తే దాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు మంత్రి గారూ. మీకు ఫోన్ ట్యాపింగ్ గురించి కనీసం ప్రాథమిక అవగాహన కూడా ఉన్నట్టు లేదు.
అసలు మీకు తెలియకుండా మీ ఫోన్ నుంచి పొంగులేటి గారికి కాల్ ఎలా పోతుంది? పొంగులేటి గారి ఇన్ కమింగ్ లిస్టులో ఉన్నది మీ పేరేనా? మీ స్పీడ్/ఎమర్జెనీ కాల్ లిస్టులో పొంగులేటి గారి నెంబర్ ఉందేమో? అసలు... మీ ఫోన్ ఎప్పుడూ మీ వద్దే ఉంటుందా? మీ ఫోన్ కు పాస్ కోడ్ ఉందా? పొరపాటున మీరు ఫేస్ టైమ్ నొక్కారేమో? రాత్రి అన్నారు కాబట్టి... నిద్రమత్తులో పొంగులేటి గారికి నొక్కారేమో? ఒకవేళ మత్తులో ఉంటే మీకు తెలిసే అవకాశమే లేదు. మీకు తెలియని వ్యక్తి మీకు కాల్ చేయడం ఏంటి... మీరు గట్టిగా అరవడం ఏంటి? దీనికి ట్యాపింగ్ కు సంబంధం ఏంటి? మీ ఫిర్యాదు చూసి డీజీపీ కూడా కడుపుబ్బా నవ్వుకుని ఉంటాడు. ఆ కంప్లెయింట్ మాతో కూడా పంచుకోండి... ప్లీజ్" అంటూ ప్రవీణ్ కుమార్ వ్యంగ్యం ప్రదర్శించారు.
"ఎందుకు సార్... సీనియర్ మంత్రి అయిన మీరు పైనుంచి వచ్చిన స్క్రిప్టును గుడ్డిగా చదివి అభాసుపాలవుతారు? ఈ ప్రపంచంలో ట్యాపింగ్ కు, హ్యాకింగ్ కు అతీతమైన టెక్నాలజీ ఏదీ లేదు. స్మార్ట్ ఫోన్ కొన్నాక I Agree అనే బటన్ నొక్కిన రోజే మన వ్యక్తిగత గోప్యత అనేది ఆవిరైపోతుంది... ఒకవేళ మీకు సమయం ఉంటే నెట్ ఫ్లిక్స్ లో ఎడ్వర్డ్ స్నోడెన్ ఎపిసోడ్ లు చూడండి.
దయచేసి ఈ ట్యాపింగ్ కామెడీని మీ అందరూ ఇక ఆపేసి, కేసీఆర్ లాగా రైతన్నల వద్దకు వెళ్లండి. వారి కన్నీళ్లను తుడవండి... పోయిన పరువు కొంచెమన్నా దక్కుతుంది. తెలంగాణ ప్రజానీకం దృష్టి మరల్చేందుకు ప్రయత్నించకండి... ఇప్పటికే వాళ్లు ఆవేశంతో రగిలిపోతున్నారు" అంటూ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.