Madhya Pradesh: ప్రధాని మోదీ రోడ్ షోలో కూలిన స్టేజి.. పలువురికి గాయాలు
- మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆదివారం రోడ్ షో సందర్భంగా ఘటన
- మోదీని చూసేందుకు అనేక మంది స్టేజి ఎక్కిన వైనం
- స్టేజీ ఒక్కసారిగా కూలడంతో పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
- బాధితుల ఆరోగ్యం గురించి మోదీ ఆరా
మధ్యప్రదేశ్‌లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన ఓ స్టేజీ కూలడంతో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. జబల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఈ ఘటన జరిగింది. ‘‘మోదీ ర్యాలీ వెళ్లిన తరువాత.. ఓ స్టేజీ కూలింది. జనాలు భారీగా స్టేజీ ఎక్కడంతో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వాళ్లందరినీ ఆసుపత్రికి తరలించాము’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రధాని తనకు రెండు సార్లు ఫోన్ చేసి గాయపడ్డవారి బాగోగుల గురించి ఆరా తీశారని పీడబ్ల్యూడీ మంత్రి రాకేశ్ సింగ్ తెలిపారు. బాధితులకు కావాల్సినవన్నీ అందించాలని ఆదేశించారని తెలిపారు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మోదీ రాష్ట్రానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు షహీద్ భగత్ సింగ్ క్రాసింగ్ వద్ద ప్రారంభమైన రోడ్ షో గోరఖ్‌పూర్‌లోని ఆదిశంకరాచార్య క్రాసింగ్ వద్ద రాత్రి 7.15 గంటలకు ముగిసింది. ఇక మోదీని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మొబైల్ ఫోన్లతో ఫొటోలు దిగారు. ‘మోదీ కా పరివార్’ అని రాసున్న ప్లకార్డులు ప్రదర్శించారు. కుటుంబపాలన గురించి మాట్లాడే ప్రధానికి సొంత కుటుంబం లేదంటూ ఇటీవల ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించడంతో ‘మోదీ కా పరివార్’ క్యాంపెయిన్‌ను ప్రధాని ప్రారంభించారు.
ఇక గత ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని ఒకటి మినహా అన్ని సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి.