Congress: ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ... ఎందుకంటే...!

Congress Party complains to EC against PM Modi
  • ఇటీవల న్యాయ్ పత్ర్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ
  • కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందన్న మోదీ
  • మోదీ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ నాయకత్వం
  • ఆర్ఎస్ఎస్ తన పాత మిత్రుడైన ముస్లిం లీగ్ ను గుర్తుచేసుకుంటోందన్న ఖర్గే
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టో 'న్యాయ్ పత్ర్ ' ను ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం లీగ్ తో పోల్చారు. హస్తం పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే, అందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమంది. 

దీనిపై కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేశ్ స్పందిస్తూ... ఇవాళ కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిందని, ఆరు ఫిర్యాదులు చేశామని, అందులో రెండు ఫిర్యాదులు ప్రధాని మోదీపై ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల సంఘం తాను స్వతంత్ర సంస్థనని చాటుకోవాల్సిన సమయం వచ్చిందని, అన్ని పార్టీలు సమానమే అని చాటి చెప్పాల్సిన తరుణం ఇదేనని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ఈసీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి, ఈ అంశంలో చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు. 

కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యల పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో 180 సీట్లు కూడా రావన్న భయంతోనే బీజేపీ నేతలు హిందూ-ముస్లిం అస్త్రాన్ని బయటికి తీసుకువస్తున్నారని ఖర్గే విమర్శించారు. 

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారుతోందనడానికి మోదీ వ్యాఖ్యలే నిదర్శనమని, ఆర్ఎస్ఎస్ తన పాత మిత్రుడైన ముస్లిం లీగ్ ను గుర్తు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. 

దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆశయాలకు ప్రతిబింబం తమ న్యాయ్ పత్ర్ మేనిఫెస్టో అని ఖర్గే స్పష్టం చేశారు. మోదీ పదేళ్ల అన్యాయానికి ఈసారి తెరపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Congress
Nyay Patr
Manifesto
Narendra Modi
Muslim League
EC
NDA
India

More Telugu News