Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... రేపు ఉగాది ఆస్థానం
- తిరుమలలో నిన్నటి వరకు భక్తుల రద్దీ
- నేడు వేచి ఉండాల్సిన పనిలేకుండానే నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి
- నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.72 కోట్ల ఆదాయం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరింది. గత కొన్ని రోజులుగా రద్దీగా ఉన్న తిరుమల క్షేత్రంలో ఇవాళ భక్తుల కోలాహలం తగ్గింది. దాంతో కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన పని లేకుండా, భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
నిన్న స్వామివారిని 73,801 మంది భక్తులు దర్శించుకున్నట్టు టీటీడీ వెల్లడించింది. 23,055 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.72 కోట్ల ఆదాయం లభించింది.
ఉగాది సందర్భంగా శ్రీవారి మూల విరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలంకరణ
రేపు (ఏప్రిల్ 9) తెలుగువారి సంవత్సరాది... ఉగాది. శ్రీ క్రోధి నామ సంవత్సర ఆగమనం సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. రేపు వేకువ జామున 3 గంటలకు సుప్రభాతం, ఆ తర్వాత ఆలయ శుద్ధి నిర్వహించనున్నారు.
ఉదయం 6 గంటలకు ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి విశేష నైవేద్య సమర్పణ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ఆలయ ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో అలంకరిస్తారు.
అనంతరం, ఆలయ బంగారు వాకిలిలో ఆగమ శాస్త్ర పండితులు, అర్చకులతో పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా, ఉగాది సందర్భంగా అష్ట దళ పాదపద్మారాధన, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం వంటి కైంకర్యాలను టీటీడీ రద్దు చేసింది.