G. Kishan Reddy: దొంగలుపోయి గజదొంగలు వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి పాలన వచ్చింది: కిషన్ రెడ్డి
- తెలంగాణలో ఏమీ మార్పు రాలేదని, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిందంతేనని వ్యాఖ్య
- బిల్డర్లు మొదలు అందరూ ఢిల్లీకి వెళ్లి వందల కోట్లు ఆర్జీ ట్యాక్స్ ఇచ్చి రావాలని ఆరోపణ
- తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శ
దొంగలుపోయి గజదొంగలు వచ్చినట్లు ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ పోయి రేవంత్ రెడ్డి పాలన వచ్చిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలుగువారమంతా ఏ పని చేసినా పంచాగం చూస్తుంటామని, అలాంటి పంచాంగ పఠనం జరిగే ఈ రోజు మనకు ఎంతో శుభసూచమన్నారు. అనంతరం ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు.
తెలంగాణలో ఏమీ మార్పు రాలేదని, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది అంతే అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఆర్జీ ట్యాక్స్ (రాహుల్ గాంధీ) వేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. బిల్డర్లు మొదలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల వరకు అందరూ ఢిల్లీకి వెళ్లి వందల కోట్లు ఇచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదని... కుక్క తోక వంకర అన్నట్లుగానే ఉంటుందన్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన.. దేశంలో ఎప్పటికీ మారదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి 2019లో 40 సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ 4కు నాలుగు మనమే గెలుస్తున్నామని, కర్ణాటకలోనూ 25 సీట్లు బీజేపీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వద్ద అభివృద్ధిపై అజెండా లేదన్నారు. హామీలు ఎలా నెరవేరుస్తారో తెలియదన్నారు.
తెలంగాణను పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తమ స్వార్థం కోసం వాడుకుందని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ళ పాటు తన కొడుకు, కూతురు, అల్లుడు, ఫామ్ హౌస్ గురించి మాత్రమే ఆలోచించాడని... కానీ తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తుంటే దొంగలు పోయి... గజదొంగలు వచ్చారన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి వేటినీ నెరవేర్చడం లేదన్నారు. డిసెంబర్ 9వ తేదీ నాడు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ దానిని మరిచిపోయారన్నారు. రాహుల్ గాంధీకి అయితే ఇవేమీ తెలియదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోని హామీలే అమలు చేయలేదంటే రాహుల్ గాంధీ మొన్న వచ్చి కొత్త హామీలు ఇచ్చి వెళ్లారని విమర్శించారు.
పాలకులు మారినప్పటికీ పాలనలో మార్పు రాలేదని, దోపిడీలో మార్పు రాలేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే అన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటే అన్నారు. ఈ రెండు పార్టీల్లో ఒకటి నెహ్రూ కుటుంబానికి కొమ్ము కాస్తే, మరో పార్టీ కేసీఆర్ కుటుంబానికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో భూముల కుంభకోణం సహా ఎంతో అవినీతి జరిగిందన్నారు.