Rajnath Singh: చైనాకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

If India renames some places in China and will it make them ours Rajnath Singh asked china
  • చైనాలోని ప్రాంతాలకు పేర్లు మార్చితే భారత్ భూభాగాలుగా అయిపోతాయా? అని ప్రశ్నించిన రక్షణ మంత్రి
  • పొరుగుదేశం తప్పు చేయకూడదన్న రాజ్‌నాథ్ సింగ్
  • అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చి మావేనని చెబుతున్న చైనాకు తీవ్ర హెచ్చరిక
అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చివేసి అవి తమ భూభాగాలంటూ పదేపదే చెబుతున్న చైనాకు భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘చైనాలోని కొన్ని ప్రాంతాలకు భారత్ పేర్లు మార్చి ఇవి మా సొంతమంటే మా భూభాగాలు అయిపోతాయా?’’ అని సూటి ప్రశ్న వేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నంసాయ్‌ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. 

‘‘ ఇది మన నేల. ఈమధ్య అరుణాచల్‌ప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలకు చైనా పేర్లు మార్చి వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. పేర్లు మార్చివేసినంత మాత్రన ఏమీ సాధించలేమని మన పొరుగుదేశానికి చెప్పాలనుకుంటున్నాను. రేపు చైనాలోని ప్రాంతాలకు భారత్ పేర్లు మార్చి మావని చెబితే అవి మన భూభాగాలు అవుతాయా? చైనా ఈ తప్పు చేయకూడదు’’ అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ తరహా చర్యలు భారత్‌-చైనాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని తాను భావిస్తున్నానని చెప్పారు. 

‘ఒక వ్యక్తి స్నేహితుడినైనా మార్చుతాడేమో కానీ, పొరుగువారిని మార్చలేడు’ అని మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ చెబుతుండేవారని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. పొరుగుదేశమైన చైనాతో అవినాభావ సంబంధాలను కొనసాగించాలని భారత్ కోరుకుంటోందని పునరుద్ఘాటించారు. దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టాలని చూస్తే ఎదురుదెబ్బ కొట్టగల సత్తా నేటి భారతానికి ఉందని చైనాకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. 

భారతదేశ భూభాగాలను ఇప్పుడు ఎవరూ లాక్కోలేరని తాను హామీ ఇస్తున్నట్టు రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దామని, సరిహద్దులో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని అన్నారు. సరిహద్దు గ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం చివరి గ్రామాలు అని పిలిచేదని, కానీ తమ ప్రభుత్వం దేశంలోని మొదటి గ్రామాలు అని చెబుతోందని అన్నారు. ఈ గ్రామాలు అభివృద్ధి చెందేంత వరకు సరిహద్దులను కాపాడలేమనేది తమ విశ్వాసమని అన్నారు. ఈ గ్రామాలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాగా తొలి దశలో భాగంగా ఏప్రిల్ 19న అరుణాచల్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.
Rajnath Singh
China
Arunachal Pradesh
Lok Sabha Polls

More Telugu News