Surinder Chawla: పేటీఎం సీఈవో పదవి నుంచి తప్పుకున్న సురీందర్ చావ్లా
- పేటీఎం సంస్థలో మరో కీలక పరిణామం
- సీఈవో పదవికి సురీందర్ చావ్లా రాజీనామా
- వ్యక్తిగత కారణాలతోనే తప్పుకున్నాడంటూ పేటీఎం ప్రకటన
గత కొంతకాలంగా కుదుపులకు గురవుతున్న ప్రముఖ పేమెంట్స్ సంస్థ పేటీఎంలో సంస్థాగత పరంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈవో పదవి నుంచి సురీందర్ చావ్లా వైదొలిగారు.
సురీందర్ చావ్లా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని పేటీఎం నేడు ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ రాజీనామా జూన్ 26 నుంచి వర్తిస్తుందని తెలిపింది. సురీందర్ చావ్లా స్థానంలో బాధ్యతలు చేపట్టే తదుపరి సీఈవో ఎవరన్నది పేటీఎం వెల్లడి చేయలేదు.
పేటీఎం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి విజయ్ శేఖర్ శర్మ తప్పుకున్నాక, ఆ సంస్థలో పైస్థాయిలో చోటు చేసుకున్న కీలక పరిణామం సురీందర్ చావ్లా రాజీనామానే.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్ర ఆంక్షలు విధించడంతో, ఓ దశలో భారత్ లో పేటీఎం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే పేటీఎంకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా థర్డ్ పార్టీ యాప్ లైసెన్స్ మంజూరు చేయడంతో ఊరట లభించింది. దాంతో పేటీఎం తన పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను తిరిగి పట్టాలెక్కించగలిగింది.
ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం షేర్లు 50 శాతం పతనమయ్యాయి.