Pothina Mahesh: సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడి దగ్గరకు వెళ్తా.. వైసీపీలో చేరికపై పోతిన మహేశ్ సంకేతాలు!
- అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న పోతిన మహేశ్
- మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలుస్తానని వ్యాఖ్య
- జనసేన అధ్యక్షుడికి సొంత పార్టీ జెండాపై ప్రేమలేదని విమర్శలు
విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడి.. రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలుస్తానని వ్యాఖ్యానించారు. దమ్మున్న నాయకుడితోనే ఉంటానని, సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడి దగ్గరకు వెళ్తానని అన్నారు. నాయకుడంటే నమ్మకం ఇచ్చేవాడని, ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేవాడే నాయకుడని వ్యాఖ్యానించారు.
నాయకత్వం అంటే నమ్మకం, భరోసా, భవిష్యత్ మీద భద్రత కల్పించాలని, ఆ విధంగా మాట ఇస్తే తప్పని నాయకుడు, నాయకత్వం ఎక్కడ ఉందో అందరికీ తెలుసునని పరోక్షంగా సీఎం జగన్‌ని ప్రస్తావించారు. అక్కడే చేరాలని సన్నిహితులు, మద్దతుదారులు సూచిస్తున్నారని, అటువైపే అడుగులు పడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. అటువైపే ప్రయాణం చేయాలని తన మనసు కూడా కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడికి, నాయకులకు సొంత పార్టీ జెండాపై ప్రేమలేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలని చూస్తున్నారని పోతిన మహేశ్ విమర్శలు గుప్పించారు. పదిమంది కలిసి వచ్చి ఒక నాయకుడి మీద దాడి చేస్తే అది రాజకీయం కాదన్నారు. వ్యక్తిగతంగా తనను జనసేన పార్టీలో చంపేశారని, కాబట్టి తన రాజకీయ పునర్జన్మ మొదలవుతుందని అన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.