Narendra Modi: తమిళిసై, అన్నామలైతో కలిసి చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు షో
- మోదీతో పాటు రోడ్డు షోలో పాల్గొన్న అన్నామలై, తమిళిసై
- ఓపెన్ టాప్ వాహనంలో నిలుచొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలిన మోదీ
- మోదీ మోదీ అంటూ నినాదాలు చేసిన ప్రజలు
తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు షో నిర్వహించారు. పానగల్ పార్కు నుంచి ప్రారంభమైన ఈ రోడ్డు షో ఎల్డామ్స్ రోడ్డు వరకు కొనసాగుతుంది. ఈ రోడ్డు షో సందర్భంగా ప్రధాని మోదీ సౌత్ చెన్నై, నార్త్ చెన్నై, సెంట్రల్ చెన్నై పార్టీ అభ్యర్థులను పరిచయం చేయనున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సౌత్ చెన్నై నుంచి పోటీ చేస్తున్నారు. రోడ్డు షో ప్రారంభమైన తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, తమిళిసై ప్రధాని మోదీతో కలిసి వాహనంపై ఎక్కి రోడ్డు షోలో పాల్గొన్నారు.
ఓపెన్ టాప్ వాహనంలో మోదీ పక్కన ఇద్దరూ నిలుచుని ఉన్నారు. ప్రధాని రోడ్డుకు ఇరువైపుల ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ... బీజేపీ గుర్తును చూపిస్తూ ముందుకు కదిలారు. ర్యాలీకి వచ్చిన ప్రజలు 'మోదీ... మోదీ' అంటూ నినాదాలు చేశారు. మోదీ రేపు కూడా తమిళనాడులో పర్యటించనున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
మోదీ వరుస ట్వీట్లు
ఏళ్ళుగా చెన్నైలో ప్రజలు డీఎంకేను గెలిపిస్తూ వస్తున్నప్పటికీ ఈ నగరానికి వారు చేసిందేమీ లేదని మోదీ విమర్శించారు. డీఎంకే ప్రభుత్వం అవినీతి, కుటుంబ పాలనతో బిజీగా ఉందని విమర్శించారు. ఆ పార్టీ ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు. ముఖ్యంగా సవాళ్లు ఎదురైనప్పుడు వారు కనిపించరన్నారు. మన వ్యూహాత్మక ప్రయోజనాలకు విరుద్ధంగా... మన మత్స్యకారులకు నష్టం కలిగించేలా కాంగ్రెస్, డీఎంకే పరస్పరం సహకారంతో ముందుకు సాగుతాయన్నారు. ఇందుకు కచ్చతీవు నిదర్శనమన్నారు. ఈసారి డీఎంకే, కాంగ్రెస్‌లను తిరస్కరించేందుకు చెన్నై సిద్ధమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
బీజేపీ ప్రభుత్వం రోడ్లు, ఓడరేవులు, పట్టణ రవాణా, సంస్కృతి, వాణిజ్యం, కనెక్టివిటీ, ఇంధనంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం పని చేస్తోందన్నారు. చెన్నైలో వరదలు వంటి విపత్తు వచ్చినప్పుడు ఆదుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ను బలోపేతం చేశామన్నారు. ఆర్థిక వృద్ధికి కీలకమైన స్తంభమైన ఎంఎస్ఎంఈ రంగానికి ఊతమిస్తున్నట్లు చెప్పారు.
తమ ప్రభుత్వం తమిళ సంస్కృతిని గౌరవిస్తోందన్నారు. ఐక్య రాజ్య సమితిలో తమిళంలో కొన్ని పదాలు మాట్లాడే అవకాశం తనకు లభించినందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై తమిళ సంస్కృతిని, భాషను ప్రాచుర్యంలోకి తీసుకురావడం కొనసాగిస్తామన్నారు. రెండు సంవత్సరాల క్రితం, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ప్రారంభించామని... దీని ద్వారా తమిళ సంస్కృతికి మరింత ప్రాచుర్యం లభించేలా చేశామన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమిళ డీడీ చానల్‌ను పునఃప్రారంభించినట్లు చెప్పారు.