Nitish Kumar Reddy: బౌలింగ్ పిచ్ పై బ్యాట్ ఝళిపించిన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి... 182 రన్స్ చేసిన సన్ రైజర్స్

Nitish Kumar hammers Punjab Kings bowlers as SRH scored 182 runs
  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్
  • టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్
  • బ్యాటింగ్ కు ఏమాత్రం అనుకూలించని పిచ్
  • 37 బంతుల్లో 64 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి
  • 4 ఫోర్లు, 5 సిక్సులు బాదిన యువ బ్యాటర్
పంజాబ్ కింగ్స్ తో ముల్లన్ పూర్ లో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. బ్యాటింగ్ కు ఏమాత్రం అనుకూలంగా లేని ఈ పిచ్ పై ఆ మాత్రం స్కోరు చేయడం గొప్ప విషయమే! అందుకు తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డిని అభినందించాలి. సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన నితీశ్ 37 బంతుల్లోనే 64 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 4 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఈ యువ బ్యాటర్ కు ఐపీఎల్ లో ఇదే తొలి అర్ధసెంచరీ.

అంతకుముందు, ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (21), అభిషేక్ శర్మ (16) క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. హెడ్ ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుటవ్వాల్సింది... కానీ పంజాబ్ కింగ్స్ డీఆర్ఎస్ తీసుకోకపోవడంతో బతికిపోయాడు. మార్ క్రమ్ (0) రెండు బంతులాడి డకౌట్ అయ్యాడు. 

పంజాబ్ లెఫ్టార్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 వికెట్లు తీసి సన్ రైజర్స్ టాపార్డర్ ను దెబ్బతీశాడు. రాహుల్ త్రిపాఠి (11), హెన్రిచ్ క్లాసెన్ (9) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. 

నితీశ్ రెడ్డికి అబ్దుల్ సమద్ నుంచి కాసేపు సహకారం అందింది. సమద్ 12 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 4, శామ్ కరన్ 2, హర్షల్ పటేల్ 2, రబాడా 1 వికెట్ తీశారు.
Nitish Kumar Reddy
SRH
PBKS
Mullanpur
IPL 2024

More Telugu News