Daggubati Purandeswari: కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు.. నమ్మవద్దు: పురందేశ్వరి
- ముస్లిం రిజర్వేషన్లపై పురందేశ్వరి మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం
- అలాంటి వార్తలను నమ్మవద్దని ముస్లింలను కోరిన బీజేపీ ఏపీ చీఫ్
- పురందేశ్వరికి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకేనన్న లంకా దినకర్
తనపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనేది బీజేపీ నినాదమని పేర్కొన్న ఆమె.. ముస్లిం రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్టుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది ఫేక్ అని, అలాంటి వాటిని నమ్మవద్దని కోరారు.
సమాజంలో అందరినీ కలుపుకొని పోతూ అభివృద్ధి వైపు నడిపించడమే బీజేపీ అభిమతమని వివరించారు. ఇందుకు భిన్నంగా ట్రోల్ అవుతున్న నకిలీ వార్తను నమ్మవద్దని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ కూడా స్పందించారు. రాజమండ్రిలో పురందేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని, అనని మాటలను అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.