Rahul Gandhi: దేశ విభజన కోరుకున్న వారితో చేతులు కలిపింది ఎవరో చరిత్రకు తెలుసు: రాహుల్ గాంధీ
- దేశంలో ఎన్నికల కోలాహలం
- బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శల పర్వం
- ఇటీవల కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ తో పోల్చిన ప్రధాని మోదీ
- రాజకీయ వేదికలపై అబద్ధాలు చెప్పినంత మాత్రాన చరిత్ర మారిపోదన్న రాహుల్
లోక్ సభ ఎన్నికల ముంగిట బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శల దాడి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో మేనిఫెస్టో ప్రకటించగా, ఆ మేనిఫెస్టో చూస్తే ముస్లిం లీగ్ గుర్తొస్తోందంటూ ప్రధాని మోదీ విమర్శలకు శ్రీకారం చుట్టారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
నాడు దేశ విభజన కోరుకున్న వారితో చేతులు కలిపింది ఎవరో చరిత్రకు తెలుసని ఎత్తిపొడిచారు. రాజకీయ వేదికలపై అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన చరిత్ర చెప్పే సాక్ష్యాలు మారిపోవని స్పష్టం చేశారు.
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటీష్ వారికి మద్దతిచ్చింది ఎవరు? దేశ జైళ్లన్నీ కాంగ్రెస్ వారితో నిండిన వేళ, దేశ విభజన చేసిన వారితో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపింది ఎవరు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
"ఈసారి ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటం. ఒకవైపు ఎప్పుడూ దేశ ఐక్యతను కోరుకునే కాంగ్రెస్... మరోవైపు ఎప్పుడూ దేశ విభజనకు ప్రయత్నించే శక్తులు ఉన్నాయి" అని రాహుల్ గాంధీ అభివర్ణించారు.