AAP: కేజ్రీవాల్‌కు షాక్... మంత్రి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజ్ కుమార్ ఆనంద్
- కేజ్రీవాల్ కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్
- పార్టీ తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణ
- ఇకపై ఈ పార్టీతో కలిసి పని చేసేది లేదని వెల్లడి
ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్. ఆయన కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పటేల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. 2022లో కేబినెట్ మంత్రి అయ్యారు. లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్, ఎస్సీ అండ్ ఎస్టీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, కోఆపరేటివ్ అండ్ గురుద్వారా ఎలక్షన్ డిపార్టుమెంట్స్ అదనపు బాధ్యతలను కూడా కలిగి ఉన్నారు.
మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. అవినీతిపరులతో తాను కలిసి ఉండలేనన్నారు. తాను ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరానన్నారు. కానీ ఇకపై ఈ పార్టీతో కలిసి పని చేసేది లేదని పేర్కొన్నారు. పార్టీలో ఎస్సీ నేతలకు సరైన గౌరవం లేదన్నారు. ఎస్సీలకు మోసం జరిగిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పు తర్వాత తమ వైపు తప్పు ఉందని తెలుస్తోందని వ్యాఖ్యానించారు.