Arvind Kejriwal: తీహార్ జైలు నుంచి మరో సందేశం ఇచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal says from jail that he is Ready to bear all hurdles and atrocities to save Constitution

  • రాజ్యాంగ రక్షణకు తాను సిద్ధమన్న ఢిల్లీ సీఎం
  • నియంతృత్వ ప్రభుత్వమంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపాటు
  • అన్ని అవరోధాలు, దౌర్జన్యాలను ఎదుర్కుంటానంటూ భార్య సునీతకు చెప్పిన కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీతా కేజ్రీవాల్ ద్వారా ఆప్ నేతలకు కీలక సందేశం పంపించారు. రాజ్యాంగ రక్షణకు తాను సిద్ధంగా ఉన్నానని, కేంద్రంలోని నియంత ప్రభుత్వం సృష్టిస్తున్న అన్ని అవరోధాలు, దౌర్జన్యాలను భరించేందుకు తాను రెడీగా ఉన్నట్టు భార్య సునీతకు ఆయన చెప్పారని ఆప్ కీలక నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఆప్ శ్రేణులు తమ సేవలను నిరంతరాయంగా కొనసాగించాలని కేజ్రీవాల్ కోరినట్టు తెలిపారు.

రాజ్యాంగాన్ని రక్షించడమే నేడు అత్యంత ముఖ్యమైన విషయమంటూ కేజ్రీవాల్ చెప్పారని, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు ‘సంవిధాన్ బచావో.. తనషాహీ హఠావో’ దినంగా పాటించాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని రాయ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ నివాసంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌తో పార్టీ నాయకత్వం భేటీ అయిన అనంతరం మంత్రి రాయ్ ఈ ప్రకటన చేశారు.

కాగా తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ను మంగళవారం ఆయన భార్య సునీత, వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ కలిశారు. ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగించిన తర్వాత తొలిసారి వారు కేజ్రీవాల్‌ను మంగళవారం కలిశారు.

  • Loading...

More Telugu News