Kiran royal: ఇప్పుడు ఏ చెయ్యి నరుక్కుంటావ్?.. పోతిన మహేశ్‌పై జనసేన నేత కిరణ్‌ రాయల్‌ ఫైర్

JanaSena leader Kiran royal Questioned pothina Mahesh that Now which hand will he chop off

  • పార్టీ మారితే చెయ్యి నరుక్కుంటానన్న పోతిన మహేశ్ వ్యాఖ్యలను గుర్తుచేసిన తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్
  • పోతిన మహేశ్‌కు రాజకీయ భవిష్యత్ ఇచ్చిందే పవన్ కల్యాణ్ అన్న కిరణ్ రాయల్
  • ప్యాకేజీ కోసమే వైసీపీలోకి వెళ్లారని మండిపాటు

విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయించకపోవడంతో జనసేనకు రాజీనామా చేసి నేడు (బుధవారం) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్‌పై తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. తన రాజకీయ జీవితం జనసేన పార్టీలోనేనని, వేరే పార్టీ జెండా పట్టుకుంటే కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఎవరైనా తన చెయ్యి నరికేయవచ్చంటూ గతంలో పోతిన మహేశ్ అన్నారని, మరి ఇప్పుడు ఆయన ఏ చేయి నరుక్కుంటారని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ‘‘ కొబ్బరికాయల కత్తి నీకు మా కార్యకర్తలు కొరియర్ చేస్తారు. జనసేన వల్ల నువ్వు నాయకుడివి అయ్యావన్న విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలి. ఎంత తీసుకుని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై బురద చల్లావో అందరికి తెలుసు’’ అని కిరణ్ రాయల్ మండిపడ్డారు.

గతంలో జనసేన పార్టీ కార్యాలయం ముందు పవన్‌ కల్యాణ్‌ కోసం పడిగాపులు కాసిన విషయాన్ని మరిచిపోయారా అంటూ పోతిన మహేశ్‌ను కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ‘‘నిన్ను నాయకుడిని చేసిందే జనసేనాని. ఈ విషయాన్ని మర్చిపోవద్దు’’ అని అన్నారు. 2019 ఎన్నికల్లో సీటు ఇచ్చింది పవన్ కల్యాణే అని అన్నారు. కోవర్ట్ అని తెలియడంతోనే పోతిన మహేశ్‌ను దూరం పెట్టారని అన్నారు. మొత్తానికి సీటు కోసం 10 రోజుల ధర్నా, దీక్ష చేసి ఇప్పుడు ప్యాకేజీ కోసం వైసీపీ కండువా కప్పుకున్నారంటూ ఆరోపించారు. 

ఇక తన భవిష్యత్‌ను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చూసుకుంటారని, తనకు పార్టీపై, పవన్‌ కల్యాణ్‌‌పై ఎలాంటి అసంతృప్తి లేదని కిరణ్‌ రాయల్‌ స్పష్టత ఇచ్చారు. చెయ్యిని నరుక్కుంటానంటూ పోతిన మహేష్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన ప్లే చేశారు. కాగా రాజీనామా చేసిన అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై పోతిన మహేశ్ తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇంతకాలం పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలో చేరి విమర్శలు చేయడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. చెయ్యి నరుక్కుంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చాయి.

  • Loading...

More Telugu News