Election Commission: రాజకీయ పార్టీల హోర్డింగ్స్‌పై ప్రచురణకర్త, ప్రింటర్స్ పేర్లు ఉండాల్సిందే: ఎన్నికల సంఘం ఆదేశాలు
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు
- అభ్యర్థుల ప్రచార ఖర్చును అంచనా వేయడానికి హోర్డింగ్స్‌పై ప్రచురణకర్తల పేర్లు తప్పనిసరి అని స్పష్టీకరణ
- ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిబంధనలు వర్తిస్తాయని వెల్లడి
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో నిబంధనలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల చట్టం ప్రకారం రాజకీయ హోర్డింగ్స్ పబ్లిషర్, ప్రింటర్ల పేర్లని కలిగి ఉండేలా చూసుకోవాలని బుధవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను, ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చండక్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అభ్యర్థుల ప్రచార ఖర్చును అంచనా వేయడానికి హోర్డింగ్స్‌పై ప్రచురణకర్తల పేర్లు తప్పనిసరిగా ముద్రించాలని స్పష్టం చేసింది.
ఇటీవల కాలంలో ప్రచురణకర్తల పేర్లు లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్యానర్లు, హోర్డింగ్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. అలాగే ఎన్నికల సంబంధిత సామగ్రి, హోర్డింగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఈసీ సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, ముద్రించిన ప్రచార సామగ్రి కంటెంట్‌కు బాధ్యత వహించడానికి ప్రచురణకర్త పేరును బహిర్గతం చేయాలని తెలిపింది. అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వరాదని తెలిపింది.