Chandrababu: ప్రజలు కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతారు: తణుకులో చంద్రబాబు
- తణుకులో ప్రజాగళం సభ
- హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న చంద్రబాబు
- మరోసారి ముగ్గురం కలిశామని, ఇక తమకు ఎదురులేదని ధీమా
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజాగళం ధాటికి ఏపీ నుంచి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ప్రజాగ్రహానికి వాయువు తోడైందంటూ పక్కనే ఉన్న పవన్ కల్యాణ్ ను చూపించారు. నేడు తణుకు సభ సాక్షిగా చెబుతున్నా సైకిల్ స్పీడుకు ఎదురులేదు, గ్లాసు జోరుకు తిరుగులేదు, కమల వికాసానికి అడ్డే లేదు అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాయి... మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని అన్నారు.
పదేళ్ల కిందట రాష్ట్ర విభజన కష్టాలు పోగొట్టేందుకు మూడు పార్టీలు కలిశాయని తెలిపారు. మళ్లీ ఇప్పుడు జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్లీ కలిశామని స్పష్టం చేశారు. కలిసింది మామూలు వ్యక్తులు కాదు... అనుభవం ఉన్న నేను, తపన ఉన్న పవన్ కల్యాణ్, దేశాన్ని నెంబర్ వన్ గా ప్రపంచపటంలో నిలపాలని కృషి చేసే నరేంద్ర మోదీ కలిశాం... ఇక మాకు తిరుగుంటుందా? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. పవన్ పై వైసీపీ నేతలు వ్యక్తిగత దాడులు చేశారు... అయినా అనేక అవమానాలను, దాడులను తట్టుకుని నిలబడిన పోరాట యోధుడు పవన్ కల్యాణ్ అని వివరించారు.
నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కల్యాణ్... నేను గానీ, తెలుగుదేశం పార్టీ గానీ ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోం అని పేర్కొన్నారు. చీకటిపాలనను అంతం చేసే క్రమంలో ఓటు చీలనివ్వబోమని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. అలాంటి సంకల్పానికి నరేంద్ర మోదీ నుంచి మద్దతు లభిస్తోంది అని చంద్రబాబు వెల్లడించారు.
చేతిలో చిప్ప పట్టుకోవడం ఖాయం!
2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లలో టీడీపీని గెలిపించారు... ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాం... వైసీపీకి డిపాజిట్లు వస్తాయా? ఇవాళ యువత పవర్ చూశాను. యువత గానీ కన్నెర్ర చేస్తే ఈ జగన్ లండన్ పారిపోతాడు. చేతిలో చిప్ప పట్టుకోవడం ఖాయం... ఎక్కడికి వెళతాడో నేను ఇప్పుడే చెప్పను... నేను, పవన్ కల్యాణ్ చేసి చూపిస్తాం. 2014-19 మధ్య ఎలాంటి పాలన జరిగిందో మీకు తెలుసు... మళ్లీ అలాంటి పాలన రావాలంటే కూటమి రావాలి, జాబు రావాలంటే కూటమి రావాలి... రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రథమ ప్రాధాన్యత.
నేను గానీ, పవన్ గానీ ఆలోచించేది దాని గురించే!
2019 నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోండి... బాదుడే బాదుడు. గత ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడు, తలపై చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు... ఇప్పుడు గుద్దుడే గుద్దులు... పిడిగుద్దులు గుద్దుతున్నాడు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీయే ఆక్సిజన్ అందిస్తుంది. నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో, పవన్ కల్యాణ్ కు అధికారం కోసమో మేం ఆలోచించడంలేదు... రాష్ట్ర ప్రజల బాగు కోసమే మేం ఆలోచిస్తున్నాం.
విధ్వంసక పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా... సంక్షేమ పాలన కావాలా, సంక్షోభ పాలన కావాలా... మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, లేక గంజాయి, డ్రగ్స్ కావాలా... మీ ఆస్తులకు రక్షణ కావాలా, లేక భూ మాఫియా కావాలా... నడుములు విరిగే దారుణమైన రోడ్లు కావాలా, భద్రతనిచ్చే రోడ్లు కావాలా... రూ.10 ఇచ్చి రూ.100 దోచేసే దొంగలు కావాలా, మీ సంపద పెంచే కూటమి కావాలా... సచివాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్లు కావాలా, సంపద సృష్టించే వాళ్లు కావాలా... ధరల బాదుడు కావాలా, దోపిడీ లేని పథకాలు కావాలో అందరూ ఆలోచించుకోవాలి.
వీళ్లు ఫేక్ ఫెలోస్, బోగస్ ఫెలోస్
ఈ రాష్ట్రంలో ఫేక్ ఫెలోస్ వచ్చారు, బోగస్ వ్యక్తులు వచ్చారు... వీళ్లను నమ్మితే నష్టపోతాం. యూట్యూబ్ లో కానీ, మీ ఫోన్లలో వచ్చేవి కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.. వాస్తవాలను తెలుసుకోండి... దొంగలు పెట్టే ఫేక్ న్యూస్ నమ్మొద్దు. జగన్ ఎన్నికల ముందు ఎన్నో చెప్పాడు... ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మిమ్మల్ని ఎవరినైనా కలిశాడా? పరదాలు కట్టుకుని తిరిగాడు. తాడేపల్లిలో అయినా ఎవరినైనా కలిశాడా? ఇప్పుడు మళ్లీ మీ వద్దకు వస్తున్నాడు.. మీపై ప్రేమ కాదు, మీ ఓట్ల కోసం వస్తున్నాడు... జగన్ ను నమ్మం అని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది.
సూపర్-6తో మీ ముందుకు వస్తున్నాం
కూటమి తరఫున నిర్దిష్టమైన అజెండాతో మీ ముందుకు వస్తున్నాం. సూపర్-6తో మీ ముందుకు వస్తున్నాం. అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ నిధి. స్త్రీలకు నెలకు రూ.1500 ఇస్తాం, ఇద్దరుంటే రూ.3000, ముగ్గురుంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6000... ప్రతి నెలా ఒకటో తారీఖున ఆడబిడ్డల అకౌంట్లలో వేస్తాం.
రెండోది తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15,000 చొప్పున ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు, ఐదుగురు ఉంటే రూ.75 వేలు ఇస్తాం.
మూడోది... ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. నాలుగోది... మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఐదు... అన్నదాతలకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తాం. ఆరు... యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.
జగన్ వస్తున్నాడంటే పరిశ్రమలు పారిపోతాయి... మేం వస్తున్నామంటే పరిశ్రమలు అవే వస్తాయి.... మన యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పెన్షన్ అందిస్తాం. వృద్ధులకు, వితంతువులకు, పేదలకు ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం... రెండో నెలలో కూడా తీసుకోకపోతే మూడో నెలలో కూడా ఇచ్చే బాధ్యత మాది. వికలాంగులకు రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇస్తాం.
మళ్లీ చెబుతున్నా... వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం
వాలంటీర్లకు మరోసారి చెబుతున్నా. నిన్ననే మా కూటమి తరఫున ప్రకటన చేశాం. వాలంటీరు వ్యవస్థ ఉంటుంది... మీరు తప్పుడు పనులు చేయొద్దు... మీకిచ్చే జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలో దిక్కు తెలియడంలేదు. మంత్రి ధర్మాన అంటున్నాడు... రాష్ట్రంలో వాలంటీర్లే లేరట... వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారట. రాజీనామా చేసిన వాలంటీర్లు రెండు శాతమే.
ఈ సందర్భంగా వాలంటీర్లకు చెబుతున్నా... వాళ్లు చెప్పినా మీరు రాజీనామా చేయొద్దు... మీకు అండగా మేముంటాం. మీరు మంచి పనులు చేస్తే మీకు మద్దతుగా నిలుస్తాం. మీతో తప్పుడు పనులు చేయించి మీ జీవితాలు నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్ ఆలోచిస్తున్నాడు... వాలంటీర్లు విజ్ఞతతో ఆలోచించాలి... రాష్ట్రాభివృద్ధికి దోహదపడండి.. అవసరమైతే రూ.10 వేలు కాదు... రూ.1 లక్ష సంపాదించుకునే మార్గం చూపిస్తాను.