World Athletics: ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేతలకు రూ.41.60 లక్షల ప్రైజ్!
- అథ్లెటిక్స్ క్రీడల్లో స్వర్ణ పతక విజేతలకు ప్రపంచ అథ్లెటిక్స్ నగదు బహుమతులు
- మొత్తం 48 విభాగాల్లో ఒక్కో విజేతకు రూ.41.60 లక్షల బహుమతి ప్రకటించిన వైనం
- 2028 ఒలింపిక్స్ నుంచి రజత, కాంస్య విజేతలకూ నగదు రివార్డులు
- ఒలింపిక్స్ విజేతలకు ప్రైజ్ మనీ ప్రకటించిన తొలి క్రీడా సమాఖ్యగా అరుదైన గుర్తింపు
ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించే క్రీడాకారులకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్టు ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) తాజాగా ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లోని 48 అథ్లెటిక్స్ విభాగాల్లో విజేతలకు ఈ ప్రైజ్ మనీ అందజేయనున్నట్టు పేర్కొంది. 2028 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ నుంచి స్వర్ణంతో పాటు రజత, కాంస్య పతక విజేతలకు నగదు బహుమతులు ఇస్తామని వెల్లడించింది. ఒక్కో విజేత 50 వేల డాలర్ల (రూ. సుమారు 41.60 లక్షలు) బహుమతి అందుకోనున్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఆదాయంలో తమకు అందే వాటాలో రూ.2.4 మిలియన్ డాలర్లను నగదు బహుమతుల కోసం కేటాయించామని డబ్ల్యూఏ పేర్కొంది.
‘‘ఒలింపిక్స్‌లో నగదు బహుమతి అందజేసే మొదటి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్లూఏ నిలుస్తుంది. అత్యున్నత క్రీడల్లో బంగారు పతకాలు సాధించే క్రీడాకారులకు పారిస్ ఒలింపిక్స్ నుంచి ప్రైజ్ మనీ అందజేస్తాం’’ అని ఓ ప్రకటనలో తెలియజేసింది.
‘‘ఇప్పటికే మేము సభ్య ఫెడరేషన్లకు ఒలింపిక్ డివిడెండ్లలో వాటాను ఇస్తున్నాం. ప్రస్తుతమున్న చెల్లింపులకు అదనంగా ఏటా 5 మిలియన్ డాలర్లను క్రీడా ప్రాజెక్టుల అభివృద్ధికి కేటాయిస్తున్నాం. ఇకపై ఒలింపిక్ పసిడి పతక విజేతలకు కూడా నగదు రివార్డులను ఇస్తాం’’ అని డబ్ల్యూఏ అధ్యక్షుడు సెబాస్టియన్ కో పేర్కొన్నారు.