Allagadda: ఆళ్లగడ్డలో కీలక పరిణామం.. 33 ఏళ్ల తర్వాత ఒక్కటైన భూమా, ఇరిగెల కుటుంబాలు
- బైరెడ్డి రాజశేఖర్రెడ్డి చొరవతో ఏకమైన భూమా, ఇరిగెల ఫ్యామిలీలు
- ఆళ్లగడ్డలో పెరిగిన కూటమి బలగం
- ఆళ్లగడ్డలో భూమా, గంగుల, ఇరిగెల, ఎస్వీ వర్గాలదే కీలకపాత్ర
- 1992లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో ఇరిగెల కుటుంబం మద్ధతుతో భూమా నాగిరెడ్డి గెలిచిన వైనం
ఆళ్లగడ్డలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 33 ఏళ్ల తర్వాత భూమా, ఇరిగెల కుటుంబాలు ఒక్కటయ్యాయి. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్రెడ్డి చొరవతో ఇలా ఈ రెండు ఫ్యామిలీలు ఏకమయ్యాయి. ఈ రెండు కుటుంబాల కలయికతో ఆళ్లగడ్డలో కూటమి బలం పెరిగింది. కాగా, ఆళ్లగడ్డలో రాజకీయాల్లో పార్టీల కంటే కూడా భూమా, గంగుల, ఇరిగెల, ఎస్వీ వర్గాలదే కీలకపాత్ర.
1992లో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక విజయాన్ని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ తరఫున భూమా నాగిరెడ్డి, కాంగ్రెస్ తరఫున గంగుల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. గెలవాలన్న లక్ష్యంతో నేరుగా ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. అప్పటి సీనియర్ టీడీపీ నేతలు జమ్మలమడుగు ఎమ్మెల్యే గుళ్లకుంట శివారెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ మధ్యవర్తిత్వంతో ఇరిగెల కుటుంబం టీడీపీ విజయానికి కృషి చేసింది.
దాంతో ఆ ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి గెలిచారు. అప్పుడు భూమా-ఇరిగెల కుటుంబాలు కలిసి పనిచేయడంతో గెలుపు సులువైందని రాజకీయ విశ్లేషకులు భావించారు. నేడు మళ్లీ 33 ఏళ్ల తర్వాత మరోసారి ఈ రెండు ఫ్యామిలీలు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి చొరవతో ఏకమయ్యాయి.