Revanth Reddy: కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలు లేరు.. పదేళ్లు రేవంతే సీఎం: మంత్రి కోమటిరెడ్డి
- పార్టీలో గ్రూపులు లేవు.. అంతా రేవంత్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామన్న కాంగ్రెస్ సీనియర్
- మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని మండిపాటు
- మాజీ మంత్రి హరీశ్ రావు, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండేలు ఎవరూలేరని, పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. పదేళ్లపాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని వ్యాఖ్యానించారు. తామంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని ఆయన అన్నారు.
మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఏక్‌నాథ్ షిండేని సృష్టించిందే బీజేపీ అని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. పనికిరాని చిట్ చాట్‌లు బంద్ చేయాలని మహేశ్వర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను ఎందుకు మార్చారో తెలుసా అని మహేశ్వర్ రెడ్డిని కోమటిరెడ్డి ప్రశ్నించారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.