Mudragada Padmanabham: మీరు నా బద్ద శత్రువుతో వెళ్తూ.. నన్ను కూడా రమ్మంటే ఎలా?: పవన్ కల్యాణ్ పై ముద్రగడ విమర్శలు
- పవన్ కల్యాణ్ కు తానెందుకు సపోర్ట్ చేయాలన్న ముద్రగడ
- కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్ కు సూచన
- జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాపు నేత, వైపీసీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తెరచాటు రాజకీయం చేస్తూ, సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి తన గురించి నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. తాడేపల్లిగూడెంలో ఈరోజు కాపు ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ కు సపోర్టు చేయాలని కొందరు అంటున్నారని... అసలు పవన్ కు తాను ఎందుకు సపోర్ట్ చేయాలని ముద్రగడ ప్రశ్నించారు. ముద్రగడను మీరు ఎందుకు అవమానించారని చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేకపోయారని అన్నారు. తనకు బద్ద శత్రువైన చంద్రబాబుతో మీరు వెళ్తూ... తనను కూడా రమ్మంటే ఎలాగని ప్రశ్నించారు. చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో... పవన్ జైలుకు వెళ్లి మద్దతు తెలపడంతో చంద్రబాబు గ్రాఫ్ మళ్లీ పెరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే 80 సీట్లు తీసుకోవాలని, పవర్ షేరింగ్ అడగాలని తాను సూచించానని తెలిపారు.
కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్ కు ముద్రగడ సూచించారు. ప్రజాసేవ అనే మాట కూడా పవన్ నోటి నుంచి రాదని చెప్పారు. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న జగన్ లాంటి ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరని కొనియాడారు. జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని చెప్పారు.