Pawan Kalyan: కూటమి ప్రభుత్వం రాకుండా మనల్ని ఎవడ్రా ఆపేది?: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Amalapuram

  • అమలాపురంలో వారాహి విజయభేరి-ప్రజాగళం సభ
  • అమలాపురం వస్తే సొంతింటికి వచ్చినట్టు ఉంటుందన్న పవన్
  • ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా

అమలాపురంలో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి-ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అమలాపురం వస్తే తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుందని అన్నారు. అమలాపురం ప్రజలు అంతటి ప్రేమ, ఆప్యాయతలు కనబరుస్తారని చెప్పారు. కోనసీమ, అమలాపురం ప్రాంతాల్లో చిచ్చుపెట్టాలని చూస్తే తాను చూస్తూ ఉండనని హెచ్చరించారు. 

"ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమే. జనసేన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులందరికీ ఇక్కడి క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నా... నేను నాయకులెవరినీ వదులుకోను. జనసేన నేతలను గుండెల్లో పెట్టుకుంటాను. కానీ నన్ను వదిలి వెళ్లిపోతే నేనేం చేయలేను. నాయకులు వస్తారు, వెళ్లిపోతారు... జనసేన, జనసైనికులు, వీరమహిళలు, జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం, ప్రజా క్షేమం కోసం నిలబడతారు. 

గతంలో వైసీపీ నా సినిమాలు అడ్డుకుంది. అప్పుడే చెప్పాను... మనల్ని ఎవడ్రా ఆపేది? అని. ఇవాళ కూడా అదే అంటున్నా... మన కూటమి ప్రభుత్వం రాకుండా మనల్ని ఎవడ్రా ఆపేది? మేం ఇక్కడికి వస్తుంటే దారి పొడవునా భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు చెప్పారు. 

వైసీపీ నేతలు ఇసుక దోపిడీతో 40 లక్షల మంది కార్మికుల పొట్టకొట్టారు. జేపీ వెంచర్స్ అంటూ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల ఒక ముఠాగా ఏర్పడి గోదావరి ఇసుక రీచ్ లను అమ్మేసుకుని, లక్షలాది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు రావాలి... రైతులకు క్రాప్ హాలిడే పరిస్థితి రాకూడదు... అందుకే మూడు పార్టీలతో కలిసి వచ్చాం.

ఇక్కడ రైలు కూత వినిపించాలన్నది కోనసీమ వాసుల కోరిక. కోనసీమలో రైలు బండి కొబ్బరిచెట్ల మధ్య తిరగాలి... కోనసీమ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలి అని ప్రధాని మోదీకి చెబుతాను. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తాను. ఇక్కడ జీఎంసీ బాలయోగి గారి అబ్బాయి హరీశ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు... ఆయనను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 

ఇక, నేను జగన్ ను విమర్శిస్తే ఎన్నికల కమిషన్ వారు నోటీసులు ఇచ్చారు. ఏ పరిస్థితుల్లో మాట్లాడానో వివరణ ఇస్తాను. ఒక దళిత డ్రైవర్ ను ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే, అలాంటి వ్యక్తిని జగన్ వెంటేసుకుని తిరుగుతున్నారు. జగన్ జీవితం ఇప్పుడు జైలుకు, బెయిలుకు మధ్య ఊగిసలాడుతోంది. నన్ను తిట్టే కాపు నేతలు, దళిత నాయకులను ఒక్కటే అడుగుతున్నా... రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు మీరు ఏమైపోయారు? ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు?" అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News