Digi Yatra: త్వరలో విశాఖపట్నం విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలు

Digi Yatra likely to be rolled at 14 more airports by end of this month
  • ఈ నెలాఖరుకల్లా వైజాగ్ సహా మొత్తం 14 ఎయిర్‌పోర్టుల్లో డీజీ యాత్ర 
  • డీజీ యాత్ర ఫౌండేషన్ సీఈఓ వెల్లడి
  • డేటా భద్రతపై భరోసా కల్పించిన సీఈఓ
  • అంతర్జాతీయ ప్రయాణికులకు డీజీ యాత్ర వర్తింపచేసేలా చర్చలు జరుపుతున్నామని వెల్లడి
విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేసే డీజీ యాత్ర సేవలు త్వరలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో అందుబాటులోకి రానున్నాయి. వైజాగ్ సహా మొత్తం 14 విమానాశ్రయాల్లో ఏప్రిల్ నెలాఖరు కల్లా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని డీజీ యాత్ర ఫౌండేషన్ సీఈఓ సురేశ్ ఖడక్‌భవి పేర్కొన్నారు. ఈ మేరకు డీజీ యాత్ర వ్యవస్థలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలిపారు. వైజాగ్‌తో పాటు చెన్నై, కోయంబత్తూర్, శ్రీనగర్, త్రివేండ్రం, బాగ్‌డోగ్రా, భువనేశ్వర్, చండీగఢ్, డబోలిమ్, ఇండోర్, మంగళూరు, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ ఎయిర్‌పోర్టుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా ఈ సేవలు వర్తింప చేసేందుకు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నామని డీజీ ఫౌండేషన్ తెలిపింది. 

ఫేషియల్ రికగ్నిషన్ ‘డీజీ యాత్ర’తో విమానాశ్రయాల్లో చెక్ పాయింట్ల వద్ద ప్రయాణికులు సులభంగా ముందుకు వెళ్లొచ్చు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 14 ఎయిర్‌పోర్టుల్లో డీజీ యాత్ర అందుబాటులో ఉంది. దాదాపు 50 లక్షల మంది దీంతో ప్రయోజనం పొందుతున్నారు. అయితే, ప్రయాణికులు వ్యక్తిగత డేటా భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో డీజీ యాత్ర ఫౌండేషన్ సీఈఓ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, డేటా మొత్తం ప్రయాణికుల చేతిలోని మొబైల్ ఫోన్లలోనే ఉంటుందని చెప్పారు. 

డీజీ యాత్ర పనితీరు ఇలా.. 
ఈ సౌకర్యం వినియోగించుకోదలచిన వారు ముందుగా తమ మొబైల్‌లో డీజీ యాత్ర యాప్ ద్వారా ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేయాలి. తన ఫేస్, ఇతర వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తరువాత బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేస్తే ఈ వివరాలు విమానాశ్రయానికి చేరతాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో ఈ- గేట్ వద్దకు వచ్చి, బార్ కోడ్ కలిగిన బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేస్తే, ఫేషియల్ రికగ్నిషన్ సాయంతో ప్రయాణికుల గుర్తింపు, ప్రమాణ పత్రాలను ధ్రువీకరిస్తారు. అనంతరం, ఈ గేట్ ద్వారా విమానాశ్రయంలోకి వెళ్లొచ్చు. అయితే, సెక్యూరిటీ చెక్‌తో పాటు, విమానం ఎక్కేందుకు సాధారణ నియమావళిని ప్రయాణికులు పాటించాలి.
Digi Yatra
Vizag Airport
Andhra Pradesh
Digi Yatra Foundation

More Telugu News