Blur Insta Message: ఇకపై నగ్న చిత్రాలు బ్లర్.. త్వరలో ఇన్‌స్టాలో కొత్త ఫీచర్!

Meta to blur Instagram messages containing nudity in latest move for teen safety
  • చిన్నారులు, టీనేజర్ల రక్షణ కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న మెటా
  • యూజర్ల మొబైల్స్‌లోని టూల్‌తో డైరెక్ట్ మెసేజీల్లోని చిత్రాలపై నిఘా
  • నగ్న, అసభ్యకర చిత్రాలు కనిపిస్తే బ్లర్ చేసేలా వ్యవస్థ ఏర్పాటు
  • ఎండ్ టూ ఎండ్ విధానంలో ఈ పరిశీలన సాగుతుందన్న మెటా
టీనేజర్లు, చిన్నారుల ఆన్‌లైన్ భద్రత దిశగా మెటా.. ఓ కొత్త ఫీచర్‌ను పరిశీలిస్తోంది. ఇన్‌స్టాలో డైరెక్ట్ మెసేజీల ద్వారా అసభ్య, నగ్న చిత్రాలు పంపించిన సందర్భాల్లో వాటిని బ్లర్ చేసే సాంకేతికతను పరీక్షిస్తోంది. యూజర్ల మొబైల్‌ ఫోన్లలో ఉండే ఓ టూల్..డీఎమ్‌లలోని చిత్రాలను అప్పటికప్పుడు పరిశీలించి అవసరమనుకుంటే బ్లర్ చేస్తుంది. 18 ఏళ్ల లోపు వారి ఫోన్లలో ఈ ఫీచర్ డీఫాల్ట్‌గా ప్రారంభమై ఉంటుందని, పెద్దలు కూడా దీన్ని యాక్టివేట్ చేసేలా ప్రోత్సహించేందుకు నోటిఫికేషన్లు పంపిస్తామని ఇన్‌స్టా వర్గాలు తెలిపాయి. 

యూజర్ల మొబైల్ ఫోన్లోని మెషిన్ లెర్నింగ్ టూల్ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానంలో చిత్రాల పరిశీలన జరుపుతుందని సంస్థ పేర్కొంది. కాబట్టి, ఈ వివరాలు ఇన్‌స్టాకు చేరే అవకాశమే లేదని వెల్లడించింది. ఇన్‌స్టాలో డైరెక్ట్ మెసేజీలకు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మెటా మెసెంజర్, వాట్సాప్‌లో ఈ ఎన్‌క్రిప్షన్ అందుబాటులో ఉంది. 

టీనేజర్లకు ఇన్‌స్టా ఓ వ్యసనంగా మారుతోందన్న ఆందోళన అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లోనూ వ్యక్తమవుతోంది. దీనికి తోడు సైబర్ నేరగాళ్లు ఈ వేదిక ద్వారా లైంగిక దోపిడీ, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ఇన్‌స్టా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అనేక దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. గతంలో అమెరికాలోని 33 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఫేస్‌బుక్‌పై కేసు పెట్టారు. ఈ వేదికలతో కలిగే ప్రమాదాలపై సంస్థ ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆరోపించారు. చట్టవ్యతిరేక, హాని కారక సమాచారం నుంచి చిన్నారులను కాపాడేందుకు మెటా ఏ చర్యలు తీసుకుంటోందో తెలపాలని యూరోపిన్ కమిషన్ కూడా ఫేస్‌బుక్‌ను ఆదేశించింది.
Blur Insta Message
Facebook
Meta
Security Features
Cybercrime

More Telugu News